ప్రజాశక్తి-అనకాపల్లి :
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు తీసుకొచ్చిన యాప్‌లు అన్నింటినీ కలిపి ఒకే యాప్‌గా మార్చాలని, రికార్డు వర్క్ తగ్గించాలని, ఏడు నెలల నుండి ఆరేళ్ల లోపు పిల్లలకు ఎఎఫ్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలని కోరుతూ సిడిపిఓకి ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ లబ్ధిదారుల లిస్టును నమోదుకు పోషణ ట్రాకర్ యాప్, బాల సంజీవిని యాప్లో నమోదు, గర్భిణులు, బాలింతలకి ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా టిహెచ్‌ఆర్ అందిస్తున్నట్లు చెప్పారు. మళ్లీ 5 రకాల రికార్డులు రాయాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం రికార్డులు ఇవ్వలేదని, ఒక్కొక్కరు రూ.1000, రూ.1200 ఖర్చు పెట్టుకొని రికార్డులు కొనుగోలు చేయడం వలన అంగన్వాడీలకి భారంగా మారిందని చెప్పారు. రెండు పనులు చెయ్యడం వలన పనిభారం పెరిగిందన్నారు. కొత్తగా 7 నెలల నుండి ఆరేళ్లలోపు పిల్లలకు ఫోటోలు తీసి ఫుడ్ ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, ఇలా రకరకాల పనుల వలన ప్రీస్కూల్ దెబ్బతింటుందని పేర్కొన్నారు. 42రోజుల సమ్మె కాలంలో అంగీకరించిన విధంగా అన్ని యాప్‌లు కలిపి ఒకే యాప్ మార్పు చేయాలని, రికార్డు వర్క్ తగ్గించాలని, పిల్లలకు ఫోటోలు తీయాలనే నిబంధన తొలగించాలని, ప్రీస్కూల్స్‌ను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో యూనియన్ ప్రాజక్ట్ కార్యదర్శి కె.తనూజ, జ్యోతి, వరలక్ష్మి, శ్యామల, దివ్య తదితరులు పాల్గొన్నారు.