పిన్నెల్లి, మాదలలో పెట్రోల్‌ బాంబులు

May 16,2024 23:52

పిన్నెల్లిలో స్వాధీనం చేసుకున్న పెట్రోల్‌ బాంబులు, ఇతర మారణాయుదాలు, ప్రమాదకర సామగ్రి
ప్రజాశక్తి-పిడుగురాళ్ల :
గురజాల నియోజకవర్గంలో తలెత్తిన రాజకీయ ఆలజడి కొనసాగుతోంది. గురువారం మాచవరం మండలం పిన్నెల్లిలో పెట్రోల్‌ బాంబులు బయటపడటంతో పల్నాడు ప్రజలు ఉల్లిక్కిపడ్డారు. సుమారు 50 పెట్రోల్‌ బాంబులు, మారణాయుధాలు దోరకడంతో గురజాల నియోజకవర్గ ప్రజలు ఈ గొడవలు ఇంకా ఎన్నాళ్లు సాగుతాయి అని భయాందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలో ఘర్షణల నేపథ్యంలో పిన్నెల్లిలో పోలీసులు గురువారం కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించగా బాంబులు, మారుణాధాయలు బయటపడ్డాయి. దీనిపై దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్‌ మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లిలో టిడిపి, వైసిపిల మధ్య గొడవల దృష్ట్యా దాచేపల్లి సిఐ, మాచవరం ఎస్సైలు పిన్నెల్లికి చెందిన వైసిపి నాయకులు చింతపల్లి పెదసైదా, చింతపల్లి నన్నే, అల్లాభక్షు, టిడిపికి చెందిన చింతపల్లి జానీబాషా, చింతపల్లి జానీ, తండా పెద్దనన్నేను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి మారుణాయుధాలు, రాళ్లు,సీసా పెంకులు, కత్తులు, గొడ్డళ్లు, పెట్రోల్‌ నింపిన చేసిన సీసాలు, రాళ్లు, సీసా పెంకులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు. పెట్రోల్‌ బాంబులు తయారు చేసిన వ్యక్తినీ అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న ఇతరులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. నిందితులపై కేసులు నమోదు చేశామన్నారు.

ప్రజాశక్తి-ముప్పాళ్ల : మండలంలోని మాదలలో 29 పెట్రోల్‌ బాంబులు కలకలం రేపాయి. ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘర్షణతో మండలంలో పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేస్తుండడంతోపాటు అనుమానం వచ్చినచోట సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాదలకు చెందిన వైసిపి నాయకుడు సైదా ఇంట్లో బాంబులున్నాయనే అనుమానంతో సిఐ రాంబాబు, ఎస్‌ఐ హజరత్తయ్య గురువారం తనిఖీలు చేపట్టగా 29 పెట్రోల్‌ బాంబులు దొరికాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సైదా పరారీలో ఉన్నట్లు సమాచారం.

➡️