ప్రజాశక్తి – ముద్దనూరు (కడప) : గర్భవతులు క్రమంగా వైద్య పరీక్షలు చేయించుకుని పోషకాలు కలిగిన పౌష్టికాహారం తీసుకోవాలని పిహెచ్ సి వైద్యాధికారి కరిష్మా అన్నారు. సోమవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం వైద్యాధికారి కరిష్మా ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గర్భిణులకు రక్తం, షుగర్, ఆల్బుమిన్, హెచ్ ఐవి, ఎత్తు, బరువు పరీక్షలు చేశారు. డాక్టర్ మాట్లాడుతూ … గర్భవతులు వైద్యుల సూచనలు సలహాలు మేరకు రోజు వ్యాయామం చేయాలన్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. ఆకు కూరలు,ఆహారం, గుడ్లు, పాలు, విటమిన్స్, ఖనిజ లవణాలు క్రొవ్వు పదార్ధాలు, ప్రోటీన్స్ కలిగిన ఆహారం తీసుకోవాలన్నారు. ప్రమాదకర గర్భిణులు వైద్యుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు సురక్షితం అన్నారు. రక్తహీనత ఉన్న గర్భిణులు ఐరన్, క్యాల్షియమ్ మాత్రలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద గర్భవతులకు అవగాహన కల్పించి ఆరోగ్యవిద్య ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
గర్భిణులు క్రమంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి : పిహెచ్ సి వైద్యాధికారి కరిష్మా
