హర్షవర్ధన్‌రాజుప్రజాశక్తి-కడప అర్బన్ ప్రజలు తెలిసి తెలియకో పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను పోలీస్ శాఖ రికవరీ చేసి బాధితులకు అప్పగించిందని, బాధితులకు మొబైల్ ఫోన్లు అప్పగించడంలో రాష్ట్రంలోనే తొలి స్థానంలో జిల్లా పోలీసులు నిలిచామని ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు అన్నారు. గురువారం పోలీస్ పెన్నార్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 555 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. వీటి విలువ రూ.1.80 కోట్లు ఉంటుందని చెప్పారు. కడప జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్క్ నిఘా, డేటా విశ్లేషణా పద్ధతులు ఉపయోగించి భారీ మొబైల్ ఫోన్ రికవరీ ఆపరేషన్‌లో సఫలమయ్యారని తెలిపారు. సిఇఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మొబైల్ ఫోన్లు రికవరీ చేశామని చెప్పారు. ఇప్పటి వరకు 5 విడతల్లో మొత్తం రూ.7.4 కోట్లు విలువైన 4068 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామని పేర్కొన్నారు.కడప సైబర్ క్రైమ్ సిఐ మధుమల్లేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మొబైల్ ఫోన్ల రికవరీకి సంబంధించిన డిజిటల్ ఫోరెన్సిక్స్ ఆధారిత నిఘా పద్ధతులు ప్రయోగించామని పేర్కొన్నారు.
