ప్రజాశక్తి-గుంటూరు : ఈనెల 17వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతేడాది కంటే మెరుగైన ఫలితాల సాధించాలని అధికారులు కృషి చేస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతి సిలబస్ పూర్తిగా మారిన నేపథ్యంలో విద్యార్థులపై కొంత ఒత్తిడి పెరిగింది. కొత్త సిలబస్ వల్ల ఏయే భాగాల నుండి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయనే అంచనాకు అవకాశం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులయ్యేలా వారి సామర్థ్యాలకు అనుగుణంగా పరీక్షలకు సిద్ధం చేసేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఒత్తిడిని వదిలి ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధం కావాలని అధికారులు, సైకాలజిస్టులు సూచిస్తున్నారు. విభజిత గుంటూరు జిల్లాలో 150 పరీక్షా కేంద్రాల్లో 30,140 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈనెల 3వ తేదీ నుండి రోజుకు ఒక సబ్జెక్టుపై గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. సబ్జెక్టు పుస్తకాలతో పాటు జిల్లా ప్రజాపరిషత్ అందించిన ‘విద్యాజ్యోతి’ పుస్తకం సాయంతోనూ విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా స్లిప్ టెస్టులు నిర్వహించారు. సి, డి గ్రేడుల్లో ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టి తర్ఫీదు ఇస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు, కాంప్లెస్ ఇన్‌ఛార్జిలు, ఎంఇఒలు, ఆపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. విద్యాజ్యోతి పుస్తకాలతోపాటు సాయంత్రం స్టడీ అవర్స్‌లో అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలలో బెంచీలు, తాగునీరు, విద్యుత్, సరైన వెలుతురు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు డిఇఒ తెలిపారు. రెగ్యులర్ పరీక్షలతోపాటు, మరో 21 పరీక్షా కేంద్రాల్లో దూర విద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. గుంటూరు 2023లో 77.4 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 6వ స్థానం, గతేడాది 88.14 శాతంతో 16వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకొని అధికారులు పనిచేస్తున్నారు.గత అనుభవాల దృష్ట్యా జిల్లాలోని చినకాకాని, పచ్చలతాడిపర్రు, కొల్లిపర, పొన్నెకల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలు, పేరేచర్ల యాపిల్ స్కూల్లో సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. 15 రూట్ల ద్వారా ప్రశ్నాపత్రాల పంపిణీకి అధికారుల్ని నియమించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
వాట్సాప్ ద్వారా హాల్‌టిక్కెట్..
ఈ ఏడాది కొత్తగా వాట్సాప్ ద్వారా హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం పాఠశాల విద్యాశాఖ కల్పించింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులు చెల్లించలేదని హాల్ టిక్కెట్లు నిలిపివేయాన్ని నిరోధించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చింది. 9552300009 నంబర్‌కు హారు అని మెస్సేజ్ పంపించటం ద్వారా సేవలను వినియోగించుకోవచ్చు.
విద్యార్థులు ఒత్తిడికి గురవ్వొద్దు
సి.వి.రేణుక, జిల్లా విద్యాశాఖ అధికారి
విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. బెంచీలు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. అటువంటి పాఠశాలలనే పరీక్షా కేంద్రాలకు ఎంపిక చేశాం. ఎక్కడా అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా విద్యార్థులు ఉన్న సమయాన్ని వినియోగించుకొని పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాలి. పరీక్షల పట్ల భయాన్ని వదిలి ప్రశాంతంగా రాయాలి. ఒత్తిడి గురవుతున్నట్లు అనిపిస్తే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం తీసుకొని దానిని అధిగమించే ప్రయత్నం చేయాలి.
