ప్రజాశక్తి-విజయనగరంకోట : కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్-2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లాల సత్వర అభివృద్ధి కోసం స్వర్ణాంధ్ర-2047 పేరుతో దార్శనిక పత్రాన్ని రూపొందించిన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గం వారీగా అభివృద్ధి సాధనకు దార్శనిక పత్రాలను రూపొందించాలని సంకల్పించింది. దీనిలో భాగంగా ఆయా నియోజకవర్గాల పరిధిలో అందుబాటులో వున్న వనరులను వినియోగించుకొని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలతో నియోజకవర్గ అభివృద్ధికి దార్శనిక పత్రాలను రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించింది. నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికల రూపొందించడంలో భాగంగా జిల్లాలోని మంత్రులు, ఎంపిలు, శాసనసభ్యులు, మండలి సభ్యులు, జెడ్పీ ఛైర్మన్, కార్పొరేషన్‌ల ఛైర్మన్‌లు, ఇతర ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ఈనెల 15న కలెక్టరేట్‌లో ఉదయం 10.30 గంటలకు ఒక సమావేశం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ అంబేద్కర్ వెల్లడించారు. వీరితోపాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు, జిల్లా అభివద్ధిలో భాగస్వాములైన అన్ని వర్గాల నుంచి సూచనలు స్వీకరించిన మీదట వీటన్నింటినీ క్రోడీకరించి ఒక సమగ్ర దార్శనిక పత్రాన్ని రూపొందిస్తామని తెలిపారు.
