మెరుగైన సేవలు అందించండి: ఎమ్మెల్యే

ప్రజాశక్తి-గిద్దలూరు / గిద్దలూరు రూరల్‌ : గిద్దలూరు ఏరియా వైద్యశాలలో వైద్యులు పేషెంట్లకు మంచి సేవలందించి ఆసుపత్రి అభివృద్ధికి సహకరించాలని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వైద్యులకు పిలుపునిచ్చారు. సోమవారం గిద్దలూరు ఏరియా వైద్యశాలలో వైద్యశాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్యశాల నూతన భవనాల నిర్మాణంపై సంబంధిత ఏపిఎంఐడిసి ఇంజనీర్ల వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి భవన నిర్మాణాలకు మేఘా సంస్థ అనర్హులన్నారు. భవన నిర్మాణ గుత్తేదారు మేఘ సంస్థ ప్రణాళికలకు విరుద్ధంగా చాలా నాణ్యత లోపంగా భవనాలు నిర్మించటం పట్ల ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. గత టిడిపి ప్రభుత్వ తాను ఎమ్మెల్యే హయాంలో 40 పడకలుగా ఉన్న గిద్దలూరు ఏరియా వైద్యశాలను వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి నిధులు మంజూరు చేయించగా, వైసిపి ప్రభుత్వం తిరిగి 40 పడకల ఆసుపత్రిగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల ప్రభుత్వం నిధులు కాజేసి నాసిరకంగా భవనాలు నిర్మించటం పట్ల ఏపీఎంఐడిసి చీఫ్‌ ఇంజనీర్‌తో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడారు. గిద్దలూరు ఏరియా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించాలని సిఈని కోరారు. సిఈ స్పందిస్తూ ఈ నెల 12వ తేదీ గురువారం గిద్దలూరు వైద్యశాల భవనాల పరిశీలనకు వస్తానని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. ఈ నెల 31 లోగా ఆసుపత్రిలో జనరేటర్‌ ఏర్పాటు చేయాలని మేఘ ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల మెడికల్‌ సూపరింటెండెంట్‌ షేక్‌ ఆదాం, ఆర్‌ఎంఓ కడప రమణారెడ్డి, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ విజయలక్ష్మి, డాక్టర్‌ సుధాకర్‌, శ్రీకాంత్‌, వైద్య సిబ్బంది, ఏపీఎంఐడిసి ఇంజనీర్లు, మేఘ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. కంభం రూరల్‌: ప్రభుత్వ వైద్యులు ఎల్లవేళలా ప్రజలకు అందు బాటులో ఉండాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సూచించారు. సోమవారం మధ్యాహ్నం కంభం ప్రభుత్వ వైద్యశాలను ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యశాలలో ప్రజలకు అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. వైద్యం పొందుతున్న ప్రజలతో మాట్లాడి వైద్యశాలలో అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వైద్యం అందించే విష యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్‌, వైద్య సిబ్బంది, మండల నాయకులు పాల్గొన్నారు.

➡️