ప్రజాశక్తి –మధురవాడ : పాఠశాల విద్యార్ధులలో సైన్స్ పట్ల అవగాహన పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పిఎమ్‌శ్రీ) కార్యక్రమాన్ని మంగళవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. శ్రీకాకుళం జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్ధులు, అధ్యాపకులు పాల్గొని, గీతంలోని అధునాతన పరిశోధనశాలలను, కేన్సర్ బయాప్సీ ప్రయోగశాల, మూర్తి ప్రయోగశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ కెఎస్.కృష్ణ మాట్లాడుతూ, సైన్స్‌లో సందేహలను విద్యార్ధులు ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని, ప్రాధమిక అంశాలపై పట్టు సాధించాలని సూచించారు. నూతన విద్యావిధానంలో భాగంగా పిఎమ్‌శ్రీ కార్యక్రమం పాఠశాల విద్యా విధానాన్ని నూతన పంధాలోకి నడపించగలదన్నారు. కార్యక్రమలో గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.వేదవతి, భౌతికశాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ స్పందన, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ప్రొఫెసర్