హైకోర్టు ఉత్తర్వు తీసుకునేందుకు పిఒ నిరాకరణ

Jan 8,2025 21:20

మధ్యాహ్నం వరకు చంటిబిడ్డతో అంగన్‌వాడీ హెల్పర్‌ నిరీక్షణ 

యూనియన్‌ డిమాండ్‌తో ఉత్తర్వు కాపీ స్వీకరించిన సిబ్బంది

ప్రజాశక్తి-గజపతినగరం :  రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా తొలగించిన రామన్నపేట అంగన్‌వాడీ కేంద్రం హెల్పర్‌ మానాపురం సౌజన్యను తక్షణం విధుల్లో తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు కాపీని స్వీకరించేందుకు గజపతినగరం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పిఒ నాగమణి మీనమేషాలు లెక్కించారు. మధ్యాహ్నం వరకు ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద బాధితురాలిని వేచి ఉంచి చివరకు తీసుకునేందుకు నిరాకరించడంతో యూనియన్‌ డిమాండ్‌ మేరకు సిబ్బంది స్వీకరించారు. అంగన్‌వాడీ హెల్పర్‌ సౌజన్యను రాజకీయ వేధింపుల్లో భాగంగా గత ఏడాది నవంబర్‌ 30న అధికారులు తొలగించారు. అక్రమ తొలగింపునకు నిరసనగా అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన సౌజన్య ఒకవైపు పోరాటం చేస్తునే మరోవైపు న్యాయపోరాటం కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీంతోఆమెను విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను తీసుకొని గురువారం ఉదయం 11 గంటలకు గజపతినగరం ఐసిడిఎస్‌ పిఒ నాగమణి వద్దకు సౌజన్య వెళ్లారు. తాను మీటింగ్‌లో ఉన్నానని, తరువాత వచ్చి తీసుకుంటానని చెప్పారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో తాను ఆ ఉత్తర్వులు తీసుకునేది లేదని కార్యాలయ సిబ్బందితో చెప్పించారు. దీంతో స్పందించిన యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వి.లక్ష్మి విలేకర్లతో మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వులు తీసుకునేందుకు నిరాకరిస్తున్న పిఒ రేపు సౌజన్యతో ఏ విధంగా ఉద్యోగం చేయిస్తారా అని భయం కలుగు తుందన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2.30గంటల వరకు చంటిపిల్లతో పిఒ కార్యాయలయం వద్ద సౌజన్యం వేచి ఉంటే ఉత్తర్వులు తీసుకునేందుకు నిరాకరించడం సరైనది కాదని అన్నారు. శిక్షణకు వచ్చిన అంగన్‌వాడీలను ఎటువంటి ధర్నాలకు వెళ్లవద్దని వారిని బెదిరించి సంతకాలు తీసుకోవడం ఆమె దౌర్జన్యానికి పరాకష్ట అని అన్నారు. అనంతరం అంగన్‌వాడీలంతా పిఒను ప్రశ్నించడంతో కార్యాలయం సిబ్బంది ఆ ఉత్తర్వు కాపీని తీసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ స్పందించి అన్ని రకాలుగా అంగన్‌వాడీలను ఇబ్బంది పెడుతున్న పిఒను సస్పెండ్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ ప్రాజెక్టు కార్యదర్శి పి.జ్యోతి పాల్గొన్నారు.

➡️