నిరర్థక

Nov 30,2024 21:33 #నిరర్థక

వివాదంరాయలసీమ ధర్మల్‌ పవర్‌ప్లాంట్‌ ఫ్లైయాష్‌ తరలింపు వ్యవహారం నిరర్ధక వివాదంగా మారింది. జిల్లాలోని జమ్మలమడుగు నియో జకవర్గం ఎర్రగుంట్ల మండల పరిధిలోని కల్లమల గ్రామ సమీపంలో నిర్మితమైన ఆర్‌టిపిపి ప్లాంట్‌ బూడిద తరలింపుపై తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జెసి ప్రభాకర్‌రెడ్డి, జమ్మలమడుగు బిజెపి ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి కుటుంబీకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బూడిద తరలింపు వ్యవహారంతో సామాన్యులకు ఎటువంటి సంబంధం లేదు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఇంతటి స్థాయిలో ఘర్షణ పడితే ప్రజా సమస్యలు ఎప్పుడో చిటికెలో పరిష్కారమయ్యేవి. ఇద్దరు నాయకులు ఇటువంటి ప్రయత్నం చేయడం లేదు. కేవలం తమ స్వార్థప్రయోజనాల కోసమే కూటమికి చెందిన ఇద్దరు నాయకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యవహరించడం సిగ్గు చేటు. సమస్య ఏదైనా ఉంటే ఇద్దరూ కూర్చుకుని పట్టు విడుపులుగా వ్యవహరిస్తే సమస్య సమసిపోయేది. మొండిగా వ్యవహరిస్తే తెగేదాకా లాగడమే అవుతుందనే సంగతిని గ్రహించాలి. ఎవరికి ఉపయోగం ఉండకపోగా అనర్థమే అవుతుందనే సంగతిని ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్న నాయకులకు తెలియదను కోలేం. చివరికి సంబంధిత రాష్ట్ర ఇంధన శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి వెళ్లడం ఉత్కంఠను కలిగిస్తోంది. ఇటు వంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సిఎంఒ నుంచి ముగ్గురు నాయకులకు పిలుపురావడం, దీనికి జెసి ప్రభాకర్‌రెడ్డి వెళ్లబోనని లీకులివ్వడం ఉత్కంఠను కలిగి స్తోంది. ట్రాన్స్‌ ఫోర్టు బకాయి చెల్లింపుల దశలోనే సమస్యను పరిష్క రించుకోవాల్సిన నాయకులు, కంపెనీల తరుపున నిలబడి పోటాపోటీగా రాజకీ యం చేయడం ఏమిటో తెలియడం లేదు. ప్రజల ఓట్లను గెలిచిన ప్రజా ప్రతిని ధులు ఎవరి ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారో గ్రహించాల్సిన అసవరం ఎంతైనా ఉంది. మొన్న జమ్మలమడుగు నియోజక వర్గ కేంద్రంగానే ఆదానీ పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ ఉత్పాదన ప్లాంట్‌పై దాడి, నేడు సిమెంటు కంపెనీల మాటున కూటమి నాయకులు నిలబడి స్వార్థప్రయోజనాల కోసం పోరాటడం విస్మయాన్ని కలిగిస్తోంది. 2014 నుంచి 2024 వరకు జమ్మలమడుగు కేంద్రంగా కూటమి నాయకత్వం అరాచక పాలన సాగిస్తోంది. ఫలితంగా జిల్లా పారిశ్రామికాభివృద్ధిపై పెనుప్రభావం చూపుతోంది. ఫలితంగా పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావడానికి జంకుతున్న పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా నిరుద్యోగం తాండవం చేస్తోంది. నిరుద్యోగులు దేశాలు పట్టిపోతున్న ఘటనలు కొల్లలు. సహజంగానే కూటమి హయాంలో జిల్లాకు కొత్త పరిశ్రమలు రావు, రానివ్వరు, ఒకవేళ వచ్చినా రాజకీయ పరిపక్వత లోపం వెరసి, వైఎస్‌ కుటుంబ బూచిని చూపుతూ పాలకులు ఇతర ప్రాంతాలకు కంపెనీలను తరలించిన అనుభవాలు ఉన్నాయి. జిల్లాకు చెందిన కూటమి నాయకత్వం స్వార్థప్రయోజనాల కోసం పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకోవడం తగదనే సంగతి గ్రహించాలి. లేనిపక్షంలో భవిష్యత్‌ తరాలకు తీరని నష్టం చేసిన నాయకులుగా మిగిలిపోతారనడంలో సందేహం లేదు. ఇప్పటికైనా జిల్లా నాయకత్వం కారణంగా కొప్పర్తి ఎంఎస్‌ఎంఇ, అదానీ పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్‌, తాజాగా బూడిద వ్యవహారం కారణంగా జిల్లా పారిశ్రామికానికి వాటిల్లిన నష్టం ఇక చాలు, ఇంతటితో రాజకీయ క్రీడలు ఆపితే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందనే సంగతిని గ్రహించాలి.- ప్రజాశక్తి – కడప ప్రతినిధి

➡️