ఎఒబిలో పోలీసుల అలర్ట్‌

అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్తున్న ప్రత్యేక బలగాలు

ప్రజాశక్తి-సీలేరు

చతీస్‌ఘడ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు మందు పాత్ర పేల్చడంతో 9 మంది జవాన్లు మృతి చెందిన నేపథ్యంలో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. సరిహద్దు అటవీ ప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. అణువణువూ గాలిస్తున్నారు. మావోయిస్టుల కదిలికలపై నిఘా పెట్టారు. మావోయిస్టుల నుంచి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా పోలీసులు ఏఓబిని జల్లెడ పడుతున్నారు. కొన్నాళ్లుగా చతీస్‌ఘడ్‌ సరిహద్దుల్లో వేల సంఖ్యలో కేంద్ర పోలీసు బలగాలను మోహరించి మావోయిస్టులను పెద్ద మొత్తంలో హతమార్చిన విషయం విధితమే. 2024లో సుమారు వందమందికి పైగా మావోయిస్టులను హతమార్చి పోలీసులు పైచేయి సాధించారు. దీంతో మావోయిస్టులకు కోలుకోవాలని దెబ్బ తగిలింది. దీంతో మావోయిస్టులు పోలీసులను ఎదురు దెబ్బతీయడానికి వ్యూహ రచనలు చేసి బీజాపూర్‌ జిల్లా కుత్ర అటవీ ప్రాంతంలో పోలీస్‌ బలగాలు వెళ్తున్న వాహనమే లక్ష్యంగా శక్తివంతమైన మందు పాత్రను పేల్చి పోలీసులను హతమార్చారు. ఈ ఘటనతో సరిహద్దు పోలీసులు ఉలిక్కిపడ్డారు. మావోయిస్టుల నుంచి ఎటువంటి సంఘటనలు ఎదురు కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో వచ్చే పోయే వాహనాలను ఒరిస్సా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సరిహద్దు గిరిజన గ్రామాల్లో పోలీసులు మకాం వేసి మావోయిస్టుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి నిఘా పెట్టారు. సరిహద్దు అవుట్‌ పోస్టులలో అదనపు బలగాలు మొహరించి భద్రత మరింత కట్టు దిట్టం చేశారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో మంగళవారం అధిక సంఖ్యలో పోలీసులు కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపడుతుండడంతో ఏం జరుగుతుందో తెలియక గిరిజనులు భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని గిరిజనులు భయపడుతున్నారు.

➡️