ప్రజాశక్తి-విజయనగరంకోట : పోలీసు అమరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నగరంలోని మూడు లాంతర్లు జంక్షన్ నుంచి కోట జంక్షను వరకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ‘క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అదనపు ఎస్‌పి పి.సౌమ్యలత ఈర్యాలీని ప్రారంభిం చారు. పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొని, పోలీసు అమరవీరుల చిత్ర పటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈసందర్భంగా ఎఎస్‌పి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తూ అనేక మంది పోలీసులు తమ ప్రాణాలను సైతం కోల్పోయారన్నారు. ఉమ్మడి జిల్లాలో ఐదుగురు పోలీసు అధికారులు అంతర్గత భద్రతను పరిరక్షిస్తూ అమరులయ్యారని అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు పిల్లలు, స్కూలు, కళాశాల విద్యార్థులకు వ్యాస రచన, వక్తత్వ పోటీలు నిర్వహించి నగదు బహుమతులను, ప్రశంసా పత్రాలను అందజేసారు. దేశ భద్రత, ఐక్యతకు పటేల్ కృషి దేశ భద్రత, సమైక్యతకు సర్దార్ వల్లభారు పటేల్ కృషి చేశారని ఎఆర్ అదనపు ఎస్‌పి జి.నాగేశ్వరరావు అన్నారు.
వల్లభారు పటేల్ జయంతిని పురస్కరించుకొని బుధవారం జిల్లాపోలీసు కార్యాలయం నుంచి మయూరి కూడలి వరకు పోలీసులు ర్యాలీ నిర్వహించారు. తొలుత వల్లభారు పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం, ‘యూనిటీ రన్’ను ఎఎస్‌పి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో డిఎస్‌పి ఎం.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్‌పి యూనివర్స్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం, ఈ పరుగులో పాల్గొన్న, పోలీసు అధికారులు, సిబ్బంది మయూరి కూడలి వద్ద మానవ హారంగా ఏర్పడి, దేశ సమైఖ్యత, భద్రత, అంతర్గత రక్షణను కాంక్షిస్తూ, ప్రతిజ్ఞ చేసారు.