ప్రజాశక్తి-కడప ప్రతినిధి/చాపాడు/కడప అర్బన్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ వర్కర్లు వైఎస్‌ఆర్ జిల్లా నుంచి విజయవాడకు ఆదివారం బయలుదేరారు. పలుచోట్ల వారిని పోలీసులు ఎక్కడికక్కడ విజయవాడకు వెళ్లకుండా అడ్డుకోవడాలు, గృహనిర్బాంధాలు చేయడం వంటివి చోటుచేసుకున్నాయి. మైదుకూరు నుంచి బయలుదేరిన అంగన్వాడీ టీచర్లను, ఆయాలను, మినీ వర్కర్లను ఆదివారం మైదుకూరు పోలీసులు అరెస్టు చేసి వారిని పోలీసుస్టేషన్‌లో ఉంచారు. అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది తమ నిరసన కార్యక్రమాన్ని స్టేషన్‌లోనే తమ నిరసన తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని కోరుతున్న ప్రభుత్వం స్పదించడం లేదన్నారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వం పోలీసుల సహాయంతో అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. అంగన్వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారానికి దశల వారి పోరాటం ఆగదని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు జి.లక్ష్మీదేవి, కె.వెంకటసుబ్బమ్మ, ఎం.లక్ష్మీదేవి, సిబ్బంది పాల్గొన్నారు. కడప రైల్వేస్టేషన్ నుంచి బయలు దేరిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడపలో 20 మంది, మైదుకూరులో 21 మందిని ఏడు గంటలకు వరకు నిర్బంధించారు. అంగన్వాడీలు విజయవాడలోని రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు వెళ్తున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకు అనుమతి ఉన్నప్పటికీ పోలీసులు అక్రమంగా అంగన్వాడీలను నిర్బంధించడం ఏమిటనే విమర్శ ప్రజాసంఘాల నుంచి వినిపిస్తోంది. అక్రమ అరెస్టులతో పోరాటాలను ఆపలేరు అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని గత ప్రభుత్వ కాలంలో 42 రోజులు సమ్మె సందర్భంగా ఒప్పంద చేసిన డిమాండ్లను కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈనెల 10న చలో విజయవాడ కార్యక్రమం పోలీసులు ఒక ప్రక్క అనుమతి ఇచ్చి, మరోపక్క జిల్లాలలో ఎక్కడికక్కడ అరెస్టు, గహ నిర్బంధం, నోటీసులు అందజేయడాన్ని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం స్థానిక హోచిమిన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చలో విజయవాడకు తరలి వెళుతున్న నాయకులను, కార్యకర్తలను, ఆయాలను ప్రభుత్వం పోలీసుల చేత అరెస్టు చేయించడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ ప్రజా ఉద్యమాలపై అణచివేత ధోరణి తగదన్నారు. తమ న్యాయమ్కెన డిమాండ్లపై అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమం ఆపేదే లేదని చెప్పారు. సమావేశంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు జి.వేణుగోపాల్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె.సి.బాదుల్లా పాల్గొన్నారు.
