అంగన్‌వాడీలపై రాజకీయ వేధింపులు అరికట్టాలి

ప్రజాశక్తి – అమృతలూరు : అంగన్‌వాడీలపై రాజకీయ వేధింపులను తక్షణమే అరికట్టాలని సిఐటియు నాయకులు జి. సుధాకర్‌, బి. అగస్టీన్‌, జి. నాగరాజు డిమాండ్‌ చేశారు. భట్టిప్రోలు హనుమాన్‌ సెంటర్‌లో అంగన్‌వాడీ ఆయాగా పనిచేస్తున్న పుష్పలత పై స్థానిక నాయకులు రాజకీయ కక్షతో లేనిపోని ఆరోపణలు చేస్తూ అధికారులుపై ఒత్తిడి తెచ్చి మూడుసార్లు మెమోలు ఇప్పించడం సరైనది కాదన్నారు. పుష్పలతపై రాజకీయ వేధింపులు అరికట్టాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అమతలూరు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో మెమోలపై వివరణాత్మక దరఖాస్తును అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మెమోల జారీపై సంబంధిత అధికారులు అంగన్‌వాడీ కేంద్రం పరిధిలోని ప్రజలను విచారించకుండా ఆమె ఇంటికి పంపి రాజకీయ నాయకులు దగ్గరుండి విచారణ జరిపించటాన్ని వారు ఖండించారు. ఆయా సక్రమంగా పనిచేయకపోయినా, విధులలో నిర్లక్ష్యం వహించినా, పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించినా, కేంద్రంలో పరిశుభ్రత చూపించకపోయినా ఆ కేంద్రం పరిధిలోని ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉందన్నారు. అయితే అందుకు భిన్నంగా రాజకీయ నాయకులు రాతపూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేయడం óకక్ష సాధింపు కాదా అని వారు వినతిపత్రంలో ప్రశ్నించారు. గత ఏడేళ్లుగా పనిచేస్తున్న పుష్పలతపై ఏనాడు ఫిర్యాదులు రాలేదని తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఇప్పటి వరకూ మూడుసార్లు ఫిర్యాదులు చేయటం, మెమోలు జారీ చేయడం పట్ల రాజకీయ కక్ష సాధింపు స్పష్టంగా కనిపిస్తుందని వారు ఆరోపించారు. దీనిపై అధికారులు పునరాలోచించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. లేకుంటే సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు

➡️