అంగన్‌వాడీలపై రాజకీయ వేధింపులు ఆపాలి

ప్రజాశక్తి – భట్టిప్రోలు : అంగన్‌వాడీలపై రాజకీయ వేధింపులను ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌. మజుందర్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంజుదర్‌ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగులపై పెద్దఎత్తున రాజకీయ వేధింపులు ప్రారంభమయ్యాయన్నారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లను 90 శాతం మేర తొలగించినట్లు తెలిపారు.విఒఎలను కూడా పెద్ద ఎత్తున తొలగించినట్లు తెలిపారు. అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ప్రారంభమైనట్లు తెలిపారు. భట్టిప్రోలు గ్రామంలో అంగన్‌వాడీ సహాయ కురాలిపై కూటమి నేతులు ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదులు చేసి ఆమెను మానసిక శోభకు గురిచేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే సిడిపిఒ మూడు సార్లు అంగన్‌వాడీ సహాయకురాలికి మెమోలు ఇచ్చినట్లు తెలిపారు. సామాజికంగా వెనుకబడిన ఎస్‌టిలపై కూటమి ప్రభుత్వం దాడి చేస్తుందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కూడా పేద వర్గానికి చెందిన వారిపై జరుగుతున్న వేధింపుల పట్ల నిస్సహాయకంగా ఉన్నారని వ్యాఖ్యా నించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు మానుకోవాలని కోరారు. భట్టిప్రోలులో అంగన్‌ వాడీ సహాయకురాలు పుష్పలతపై స్థానిక నాయకుడు నేరుగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మొదటిగా సారి ఇచ్చిన మెమోలో ఆ నాయకుడు పేరును కూడా ఐసిడిఎస్‌ అధికారులు ప్రస్తావించారని, ఇది నిరూపితమైందన్నారు. అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు గురై మెమోలు ఇస్తున్నట్లు తెలిపారు. రాజకీయ వేధింపులో భాగంగానే అధికారులు మెమోలు ఇచ్చారన్న విషయాన్ని తాము నిరూపిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా చిరు ఉద్యోగులపై వేధింపు ఆపాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐటియు మండల కార్యదర్శి జి.సుధాకర్‌ చేనేత కార్మిక సంఘం నాయకుడు ఎం.సత్యనారాయణ, పి. మనోజ్‌ పాల్గొన్నారు.

➡️