స్వర్ణాంధ్ర-2047పై అభిప్రాయ సేకరణ

Oct 8,2024 23:38

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌ , వేదికపై ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి :
స్వర్ణాంధ్ర-2047 ఏర్పాటులో భాగంగా జిల్లా అభివృద్ధి విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందిచనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. దీనిపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వివిధ సంస్థలు, సంఘాల నుంచి ప్రతినిధులు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో మంగళవారం సమావేశమ య్యారు. 2023-2024 నుండి 2028-2029 ఆర్థిక సంవత్సరాల్లో వివిధ శాఖల ద్వారా తీసుకునే చర్యలపై రూపొందించిన అభివృద్ధి ప్రణాళికలను జాయింట్‌ కలెక్టర్‌ భార్గవతేజ వివరించారు. మంత్రి మాట్లాడుతూ వ్యవసాయంపై నమ్మకం కలిగించేలా రైతులకు చేయూతనివ్వాలన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఇంటికి కుళాయి, పాఠశాలల అభివృద్ధి, డ్రాపౌట్స్‌ తగ్గిపు, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని, సింగల్‌ విండో ద్వారా కొత్త పరిశ్రమలకు అనుమతులిస్తామని అన్నారు. బిఆర్‌ స్టేడియంను అభివృద్ధి చేస్తామన్నారు. రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి అవకాశాలు బాగున్నాయన్నారు. జిల్లా అభివృద్ధి ప్రణాళికను అభినందించారు. లక్ష్యాల మేరకు అభివృద్ధి సాధిస్తే దేశంలోనే గుంటూరు ఒక గొప్ప జిల్లాగా ఏర్పడుతుందన్నారు. కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మీ మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో 58 వేల మంది తమ అభిప్రాయాలు తెలియజేశారన్నారు. అన్ని మండల అధికారులు మండల స్థాయిలో ప్లాన్‌ను తయారు చేసివ్వాలన్నారు.అన్ని నియోజకవర్గాల్లో స్కిల్‌ డెవలప్‌ సెంటర్‌లు ఉండాలి : కెఎస్‌ లక్ష్మణరావుఎమ్మెల్సీ కెఎస్‌. లక్ష్మణ రావు మాట్లాడుతూ స్కిల్‌ డెవలప్మెంట్‌ యూనివర్శిటీ అమరావతిలో ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో శాశ్వత ప్రాతిపదికన స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. తెనాలి, తుళ్లూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసి అధునాతన కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. గుంటూరు ఛానల్‌ణు విస్తరించాలన్నారు. జిల్లాలో 80 శాతం కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారని, వారికి వ్యవసాయ శాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి అధికారిని నియమించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. కల్తీ పురుగు మందులు, విత్తనాల నివారణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గుంటూరు రూరల్‌ మండలంలో ఇళ్లేసుకున్న 40 వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలపై దృష్టి పెట్టాలని, రూ.4 కోట్లతో నిర్మించనున్న గుంటూరు అంబేద్కర్‌ భవన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ హెనీక్రిస్టినా మాట్లాడుతూ ప్రభుత్వం విద్య పట్ల శ్రద్ద తీసుకోవాలన్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ నగరంలో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేయించాలని, పీకలవాగుపై ఇళ్లు నిర్మించుకుని వుంటున్నవారికి ప్రత్యామ్నాయం చూపించి ఖాళీ చేయించాలని కోరారు. తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ పాఠశాల విద్యలో క్రీడలు, నైపుణ్యాభివృద్ధి అంశాలను చేర్చాలని కోరారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)ను బలోపేతం చేయాలని, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ అభివృద్ధి చేయాలని కోరారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లేసుకన్న వారికి పట్టాలు మంజూరు చేయాలన్నారు. మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణిచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.

➡️