అప్పన్నపేటలో 18 గంటల పాటు పోలింగ్‌

May 14,2024 22:26

ప్రజాశక్తి భోగాపురం : మండలంలోని భోగాపురం పంచాయతీ అప్పన్నపేట పోలింగ్‌ కేంద్రంలో (230) 18 గంటల పాటు పోలింగ్‌ జరిగింది. ఉదయం 7గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్‌ ఇవిఎంలు మొరాయించడంతో రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. మరోవైపు సాయంత్రం ఎక్కువ మంది ఓటర్లు ఓటేసేందుకు రావడంతో పోలింగ్‌ సమయం ముగిసేసరికి సుమారు 5వందల మంది ఓటర్లు క్యూలో ఉండడంతో వారంతా ఓటు వేసేందుకు తెల్లవారుజామున 3గంటలైంది. దీంతో పోలింగ్‌ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. . ఈ పోలింగ్‌ కేంద్రంలో 1274 ఓట్లు ఉన్నాయి. సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగిసే సమయానికి వరుసలో ఉన్న సుమారు 500 మందికి అధికారులు టోకెన్లు జారీచేశారు. పోలింగ్‌ కేంద్రం చిన్నదిగా ఉండడం, ఆలస్యం కావడంతో ఓటర్లంతా ఒకేసారి వెళ్లేందుకు ప్రయత్నించడంతో రద్దీ నెలకొంది. పోలింగ్‌ ఆలస్యం కావడంతో వైసిపి, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులు బడ్డుకొండ అప్పలనాయుడు, లోకం మాధవి పోలింగ్‌ కేంద్రం వద్దకు వచ్చి పరిస్థితులను పరిశీలించారు. ఈనేపథ్యంలో పిఒ ఫిర్యాదుతో తాహశీల్దార్‌ శ్యాం ప్రసాద్‌, ఎంపిడిఒ చంద్రకళ, డిప్యూటీ తాహశీల్దార్‌ శ్రీనివాసరావు, సిఐ కుమార్‌ అక్కడికి చేరుకున్నారు. పోలింగ్‌ కేంద్రం ప్రాంతంలో ఇతరులు ఎవరూ ఉండవద్దని, ఓటర్లు మాత్రమే ఉండాలని హెచ్చరించారు. పోలింగ్‌ను వేగవంతం చేసే ప్రయత్నం చేశారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో డిఎస్‌పి ఆర్‌.గోవిందరావు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి 12 గంటలకు మరో ఇవిఎం ఏర్పాటు అర్ధరాత్రి 12 గంటలు దాటాక తేదీ మారిపోతుండడంతో అధికా రులు వెంటనే మరో ఇవిఎంను ఏర్పాటు చేశారు. అప్పటికే పోలింగ్‌ కేంద్రంలో మరో 70 మంది ఓటర్లు వరుసలో ఉన్నారు. అక్కడ నుంచి మంగళ వారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు పోలింగ్‌ కొనసాగింది. అనంతరం డెంకాడ మండలంలోని లెండి కళాశాలకు ఇవిఎంలను తరలించారు. అక్కడ రద్దీగా ఉండడంతో ఉదయం 11గంటల ప్రాంతంలో ఇవిఎంలను రిసెప్షన్‌ కేంద్రంలో అప్పగించారు. దీంతో అధికారులు, పోలింగ్‌ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

➡️