రాయపూడి వద్ద నిర్మిస్తున్న సిఆర్‌డిఎ కార్యాలయం
ప్రజాశక్తి – తుళ్లూరు : రాజధాని అమరావతిలో రాయపూడి వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సిఆర్‌డిఎ ప్రధాన కార్యాలయం భవనం ఎలా ఉండాలనే దానిపై అధికారులు వెబ్‌సైట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను కార్యాలయ నిర్మాణం సైతం ఎలా ఉండాలనే దానిపై 10 ఆకర్షణీయమైన డిజైన్లను రూపొందించి వెబ్‌సైట్‌లో ఉంచారు. ప్రజలు తమకు నచ్చిన డిజైన్ మీద క్లిక్ చేసి ఓటు వేస్తే మెజార్టీ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఓటింగ్ ఈనెల 6వ తేదీ వరకు ఉంటుంది. ప్రజలుhttps://crda.ap.gov.in/ APCRDAV2/Views/ AdminBuildingPoll.aspx లింకు ద్వారా ఎపిసిఆర్‌డిఎ వెబ్ సైట్‌లోకి వెళ్లి ఓటింగ్‌లో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. అమరావతిలోని రాయపూడిలో సీడ్ యాక్సెస్ రహదారి పక్కన రూ.160 కోట్లతో జి ప్లస్ విధానంలో సిఆర్‌డిఎ కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం సిఆర్‌డిఎ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉంది. రాయపూడిలో నిర్మించే కార్యాలయం నిర్మాణం పూర్తయితే సిఆర్‌డిఎ కార్యకలాపాలు అమరావతిలోనే జరుగుతాయి. 2018లో కార్యాలయం నిర్మాణ పనులు ప్రారంభమై వైసిపి అధికారంలోకి వచ్చాక కొంతమేర జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక బిల్డింగ్ డిజైన్‌ను మార్చాలని సంకల్పించింది. సిఎం చంద్రబాబు గత అక్టోబర్‌లో సిఆర్‌డిఎ కార్యాలయానికి పూజలు జరిపి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.