నేడే పోలింగ్‌

May 12,2024 21:53

ఏర్పాట్లు పూర్తి

పోలింగ్‌ కేంద్రాలకు చేరిన సిబ్బంది

అన్నిచోట్లా పటిష్ట బందోబస్తు

ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌

ఉదయం 5.30కే మాక్‌ పోల్‌

విజయనగరం జిల్లాలో 11..మన్యంలో 6 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు

విజయనగరం జిల్లా

అసెంబ్లీ నియోజకవర్గాలు 7

ఓటర్లు 15,62,921

పోలింగ్‌ కేంద్రాలు 1847

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 362

పోలింగ్‌ సిబ్బంది 13661

పార్వతీపురం మన్యం జిల్లా అ

సెంబ్లీ నియోజకవర్గాలు 4

ఓటర్లు 7,83,440

పోలింగ్‌ కేంద్రాలు 1031

సమస్యాత్మక కేంద్రాలు 219

పోలింగ్‌ సిబ్బంది 6600

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సోమవారం ఉదయం 7గంటలకు సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. పోలింగ్‌ సామాగ్రితో సిబ్బంది వారికి కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. శనివారం ఉదయమే నియోజకవర్గ కేంద్రాలకు చేరుకుని ఇవిఎంలు, పోలింగ్‌ సామగ్రి తీసుకుని, ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. పోలింగ్‌ సిబ్బందికోసం ఉపయోగించే అన్ని వాహనాలకూ భద్రత నిమిత్తం జిపిఎస్‌ సిస్టమ్‌ అమర్చారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధైర్యంగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ జిల్లా ఎన్నిల అధికారులు ప్రకటించారు. జిల్లా ఎస్‌పిల నాయకత్వంలో ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్మాత్మక కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని కూడా నియమించారు. వాటిలో కొన్ని చోట్ల వెబ్‌ టెలికాస్ట్‌ కూడా చేయనున్నారు. విజయనగరం జిల్లాలో 10 పోలింగ్‌ స్టేషన్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 5 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. విజయనగరంలో 15,62,921 మంది ఓటర్లు ఉండగా, వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా మొత్తం 1847 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 362 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్‌ నిర్వహణకు 13661మంది సిబ్బందిని నియమించారు.

పార్వతీపురం జిల్లాలో 7,83,440మంది ఓటర్లుకుగాను 1031 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6600 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. జిల్లాలో 219 వరకు సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. వీటిపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం ఉమ్మడి జిల్లాలో 80శాతం ఓటింగ్‌ జరిగింది. ఈసారి అంతకు మించి ఓటింగ్‌ జరిగే విధంగా ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల చైతన్యం వంటివి చేశామని అధికారులు చెబుతున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల ోసం 716 వీల్‌చైర్లను ఏర్పాటు చేశారు. వారిని పోలింగ్‌ కేంద్రంలోకి తీసుకువెళ్లేందుకు ఎన్‌సిసి వలంటీర్లను నియమించారు. అంథుల కోసం ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద బ్రెయిలీ బ్యాలెట్‌ నమూనాలను అందుబాటులో ఉంచుతున్నారు.

నేడే పోలింగ్‌ సర్వం సిద్ధం.

బదిరుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సదుపాయాలు, ఎండ నుంచి రక్షణ కోసం టెంట్లు, అవసరమైన కుర్చీలు, బూత్‌లవద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. పోలీస్‌ భద్రతా చర్యల్లో భాగంగా రాష్ట్ర, కేంద్ర బలాగాలను కూడా అందుబాటులో ఉంచారు. అవసరమైన చోటుకి కేవలం 5 నిమిషాల్లోనే అక్కడికి చేరుకొనే విధంగా ర్యాపిడ్‌ యాక్షన్‌ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని లైసెన్సు తీసుకున్న తుపాకులను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. గతంలో గొడవలకు కారణమైనవారు, ప్రస్తుతం ఆవిధంగా వ్యవహరిస్తారని అనుమానం ఉన్నవారిపై పోలీసులు బైండోవర్‌ కేసులు కూడా నమోదు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద 144సెక్షన్‌ అమల్లో ఉంది. పోలింగ్‌ అనంతరం పోలీస్‌ బందో బస్తు నడుమ ఇవిఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు (రిసెప్షన్‌ సెంటర్లకు) చేర్చనున్నారు. 11 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు ఓటర్లలో స్ఫూర్తి నింపేందుకు జిల్లాలో 11 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, అదనపు హంగులు కల్పించారు.

పూసపాటిరేగ మండలం కొత్తకొప్పెర్ల, విజయనగరం పట్టణంలోని పేర్లవారి వీధి పోలింగ్‌ కేంద్రాలను యువత కోసం, రాజాంలోని మాధవ బజార్‌, బొబ్బిలి మహారాణి పేట, చీపురుపల్లిలోని మెట్టపల్లి, గంట్యాడ మండలం కరకవలస, డెంకాడ మండలం పెదతాడివాడ, విజయనగరంలోని వైఎస్‌ఆర్‌నగర్‌, కొత్తవలస మండలం చింతలపాలెం పోలింగ్‌ కేంద్రాలను మహిళల కోసం, నెల్లిమర్ల మండలం పూతికపేట, విజయనగరం కొత్త అగ్రహారంలోని బెస్ట్‌ జూనియర్‌ కళాశాల పోలింగ్‌ కేంద్రాన్ని విభిన్న ప్రతిభావంతుల కోసం మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. జిల్లా కేంద్రంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నత్య కళాశాలలోని పోలింగ్‌ కేంద్రాన్ని యూనిక్‌ కేంద్రంగా రూపొందించారు.ఉదయం 5.30కే మాక్‌ పోల్‌ ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో ఉదయం 5.30కే రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో తప్పనిసరిగా మాక్‌ పోల్‌ నిర్వహిస్తారు. ఏజెంట్లు సమయానికి రానిపక్షంలో, ఎట్టి పరిస్థితిలోనూ 5.45 గంటలకల్లా మాక్‌ పోల్‌ పూర్తి చేయనున్నారు.226 రూట్‌లు ఎన్నికల ప్రక్రియ కోసం సిబ్బందిని, సామగ్రిని తరలించడానికి జిల్లా వ్యాప్తంగా 226 రూట్లను ఏర్పాటు చేశారు. ఈ రూట్లలో 120 ఆర్‌టిసి బస్సులు, 265 మినీ బస్సులను వినియోగిస్తున్నారు. ఇవి కాకుండా ఎన్నికల అధికారులకు కార్లు, వ్యాన్‌లు తదితర ఇతర వాహనాలను సమకూర్చారు. మొత్తం 225 మంది సెక్టార్‌ అధికారులు ఈ రూట్లను పర్యవేక్షించనున్నారు.సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా జిల్లాలోని 362 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఇక్కడ ప్రత్యేక నిఘా, భద్రతా ఏర్పాట్లను చేశారు. ఈ ప్రాంతాలతో పాటుగా మొత్తం 1136 పోలింగ్‌ కేంద్రాల్లో 2272 వెబ్‌ కెమేరాలను వినియోగిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు మైక్రో అబ్జర్వర్లను సైతం నియమించారు. ఎన్నికల ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేస్తున్నారు.రిసెప్షన్‌ సెంటర్లు ఇవే పోలింగ్‌ అనంతరం ఇవిఎంలు, ఎన్నికల సామగ్రిని తిరిగి తీసుకొనేందుకు జిల్లా కేంద్రం విజయనగరంలో రెండు చోట్ల రిసెప్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జెఎన్‌టియు గురజాడ విశ్వవిద్యాలయంలో విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాలకు, డెంకాడ మండలం లెండి కళాశాలలో నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, ఎస్‌.కోట, గజపతినగరం నియోజకవర్గాలకు రిసెప్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడే ఇవిఎం స్ట్రాంగ్‌ రూములను ఏర్పాటు చేశారు. పార్వతీపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ఇవిఎంలను ఉల్లిభద్ర సమీపంలోని ఉద్యాన కళాశాలలో భద్రపర్చనున్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలి ధడమైన ప్రజాస్వామ్యం కోసం ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్‌ నాగలక్ష్మి విజ్ఞప్తి చేశారు. మొదటిసారిగా ఓటుహక్కును వినియోగించుకుంటున్న యువత అంతా తప్పనిసరిగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. సోమవారం జరగనున్న ఎన్నికల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడం కోసం కేంద్ర, రాష్ట్ర భద్రతా దళాలలను, ఎన్నికల సూక్ష్మ పరిశీలకులను, వీడియో గ్రాఫర్లను నియమించి, ఈ ప్రక్రియను సాఫీగా పూర్తి చేసేందుకు ఏర్పాటు చేశామని తెలిపారు.

రాష్ట్ర సరిహద్దులో చెక్‌ పోస్టులు

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో – ములిగూడ, బత్తిలి, భామిని, పి కోనవలస, కోనేరు కూడళ్ళ లోను, గునుపూర్‌, పద్మాపూర్‌, దండిగాం, ఆర్‌ కె బట్టివలస, అడారు వద్ద చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 1150 మంది పోలీసు సిబ్బంది, ఆరు కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నారు. 56 స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ బందాలు, 138 సెక్టార్‌ అధికారులను నియమించారు. 6,100 మందిపై బైండ్‌ ఓవర్‌ కేసులు నమోదు చేశారు. విజయనగరం జిల్లాలో 3వేల మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నారు.

➡️