బిసిల సంక్షేమానికి పెద్దపీట : మంత్రి సంధ్యారాణి
ప్రజాశక్తి – పార్వతీపురం : బడుగు, బలహీనవర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబా పూలేనని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ పూలే 199వ జయంతి వేడుకలు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తొలుత ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పూలే విగ్రహానికి కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, జెసి ఎస్.ఎస్.శోబిక, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి పూలమాలలను వేసి నివాళులు అర్పించారు. అనంతరం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పూలే చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్గీవన్ రామ్, జ్యోతీరావు పూలే, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వంటి మహానీయులను ఈ మాసంలో స్మరించుకొని జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం గర్వకారణమని అన్నారు. గాంధీ తర్వాత మహాత్మా బిరుదును పొందిన మహౌన్నత వ్యక్తి పూలే అని ప్రశంసించారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు, క్రమశిక్షణ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవల్సిన తరుణమిదని పేర్కొన్నారు. బిసిల పాలిట ఆరాధ్య ధైవం అయ్యారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బిసిల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. బిసిల్లోని వివిధ కులవృత్తుల వారి కోసం ఆదరణ పథకాన్ని పునరుద్దరించి పనిముట్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. పిఎంఎవై పథకం కింద చేపట్టే గృహ నిర్మాణాలకు బిసి లబ్ధిదారులకు అదనంగా రూ.50వేలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. స్వయం ఉపాధి కింద బిసి కార్పొరేషన్ ద్వారా రూ.900 కోట్ల రుణాలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే 50 శాతం సబ్సిడీతో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని, ఈ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. బిసి సంక్షేమ వసతి గృహాలన్నింటినీ అందంగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. జిల్లాలో 2,929 మంది బీసీ లబ్ధిదారులకు రూ.35 కోట్ల మేర రుణాలను అందిస్తున్నామన్నారు. అనంతరం 124 మంది లబ్ధిదారులకు రూ.2కోట్ల 71 లక్షల 50వేల మెగా చెక్కును, వ్యవసాయ, ఇతర పనిముట్లను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పీఎంఈజీపి కింద రూ.15 లక్షలు విలువ గల బొలొరా వాహనం, డిజె సౌండ్ సిస్టంను, రూ. లక్ష విలువైన ఆవును, రూ.50వేల విలువ గల కుట్టు మిషనును మంత్రి లబ్ధిదారులకు అందజేసారు. అనంతరం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఆ రోజుల్లోనే నిరక్షరాస్యత ఉండరాదని ఆలోచన చేసిన మహౌన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. మగవారితో పాటు స్త్రీలకు కూడా చదువు ఉండాలని, వారి కోసం ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించి దేశంలోనే తొలిసారిగా బాలహత్య ప్రతిబంధక్ గృహ కేంద్రాన్ని స్థాపించి, వితంతువులకు, గర్భిణులకు అండగా నిలిచారన్నారు. అలాగే దేశంలోనే తొలిసారిగా సత్య శోధక సమాజాన్ని స్థాపించి, సంస్కరణోద్యమాన్ని చేపట్టి, కుల, మత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించారని కలెక్టర్ గుర్తుచేసారు. పూలే ప్రతి రోజూ పుస్తక పఠనం చేసేవారని, ఆయన స్పూర్తితో నేటి విద్యార్ధులంతా పుస్తక పఠనం అలవర్చుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. జిల్లాలో 14 బీసీ సంక్షేమ వసతి గృహాలుండగా, వాటికి మరమ్మతులకుు నిధులు మంజూరయ్యాయని అన్నారు. అలాగే బీసీ విద్యార్థులకు డిఎస్సీ కోచింగ్, ఉపకార వేతనాలు, జీవనోపాధుల నిమిత్తం రూ.247 కోట్ల నిధులను మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు. వ్యవసాయ రంగంలో కూడా బీసీలు అభివద్ధి చెందాలని రూ.10 కోట్ల విలువ గల ఆధునిక వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పూలే చూపిన బాటలో యువత ముందుకు సాగాలని, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ బీసీలు తలెత్తుకునేలా తిరుగుతున్నారంటే అది పూలే కృషి ఫలితమేనని గుర్తుచేశారు. మహిళలకు విద్య ఉండాలని, ఆ రోజుల్లోనే ప్రత్యేకంగా మహిళా పాఠశాలను ప్రారంభించారని అన్నారు. మహిళలకు కుట్టుమిషన్లు, టైలరింగులో శిక్షణ వంటి వివిధ కార్యక్రమాలను చేపట్టి ప్రపంచానికి పోటీగా బీసీలను నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. జెసి ఎస్‌ఎస్ శోబిక, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ బిసిల అభ్యున్నతికి పూలే చేసిన కృషిని కొనియాడారు. మహిళలకు విద్య, హక్కుల కోసుం ఆ రోజుల్లోనే పోరాటం చేశారని తెలిపారు. ప్రభుత్వం కూడా అటువంటి మహనీయులను స్మరించుకుంటూ వారి అడుగు జాడల్లో నడవాలని కోరుకుంటుందని, ఆ దిశగా అధికారులు నడవాలని కోరారు. కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ జి.వెంకట నాయుడు, సంఘం డైరక్టర్ కె.మధుసూధనరావు, పువ్వల లావణ్య, కాపు కార్పొరేషన్ డైరక్టర్, బీసీ సంఘ నాయకులు గబ్బాన సత్తిబాబు తదితరులు మాట్లాడుతూ దేశానికి, సమాజానికి పూలే అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ కె.హేమలత, కెఆర్‌ఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, బిసి సంక్షేమ అధికారి ఇ.అప్పన్న, డిఎంహెచ్‌ఒ డాక్టర్ ఎస్.భాస్కరరావు, జిల్లా వ్యవసాయ, పశు సంవర్ధక శాఖాధికారి కె.రాబర్ట్ పాల్,డా. ఎస్.మన్మథరావు, డిఆర్‌డిఎ పీడీ ఎం.సుధారాణి, ఇతర జిల్లా అధికారులు, బీసీ సంఘ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.