నవ సమాజ స్థాపనకు పూలే బాటలు

Apr 11,2025 20:47

కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌

ఘనంగా జ్యోతిభా ఫూలే 199వ జయంతి

400 మంది లబ్దిదారులకు రుణాలు పంపిణీ

ప్రజాశక్తి-విజయనగరం  :  200 ఏళ్ల క్రితమే నవ సమాజ స్థాపనకు బాటలు వేసిన మహనీయుడు జ్యోతిభా ఫూలే అని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కొనియాడారు. మహాత్మా జ్యోతిభా ఫూలే 199వ జయంతి వేడుకలు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ముందుగా కలెక్టరేట్‌ సమీపంలోని ఫూలే, సావిత్రిబాయి విగ్రహాలకు జిల్లా కలెక్టర్‌ అంబేద్కర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జయంతి సభ నిర్వహించారు. పూలే చిత్రపటానికి అతిధులంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ అంబేద్కర్‌ మాట్లాడుతూ సమాజంపై చెరగని ముద్ర వేసిన ఆ మహనీయుడు పుట్టిన 199 ఏళ్ల తరువాత కూడా, స్మరించుకోవడం పూలే గొప్పదనానికి నిదర్శనమని పేర్కొన్నారు. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కంటే ముందే నవ సమాజ సాధనకు ఫూలే పునాది వేశారని అన్నారు. ఆయన ఆలోచనలు, కృషి ఫలాలు నేటి తరం అందుకుంటోందని చెప్పారు. ఫూలే సహధర్మచారిని సావిత్రిభాయి ఫూలే స్త్రీవిద్యకోసం పాటుపడ్డారని చెప్పారు. వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఫూలే దంపతులకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఫూలే భవన నిర్మాణానికి, అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ పిఎం విశ్వకర్మ యోజన పథకాన్ని అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర తూర్పుకాపు ఛైర్‌పర్సన్‌ పాలవలస యశస్వి మాట్లాడుతూ, ఫూలే ను భారత సామాజిక విప్లవోద్యమ పితగా పేర్కొన్నారు. ఆయన సంఘ సంస్కర్తగా, ఒక నాయకుడిగా, సామాజిక న్యాయం కోసం కషి చేసిన వ్యక్తిగా, స్త్రీవిద్యకు ఆద్యుడిగా సమాజానికి బహుముఖ సేవలను అందించారని కొనియాడారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతు మాధవన్‌ మాట్లాడుతూ, మహిళల హక్కులు, వారి విద్యకోసం విశేష కషి చేశారని కొనియాడారు. వారి విలువలు, సిద్దాంతాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా సుమారు 400 మంది బిసిలకు రుణాలను, ఉపకరణాలను పంపిణీ చేశారు. ఫూలే ఏకపాత్రాభినయాన్ని అద్భుతంగా ప్రదర్శించిన ప్రముఖ కళాకారుడు ఆర్‌బి రామానాయుడును సత్కరించారు. అంతకుముందు వివిధ బిసి సంఘాల నాయకులు ముద్దాడ మధు, వై.శంకర్రావు, విజయలక్ష్మి, గొలగాని రమేష్‌, కిల్లంపల్లి ఆచారి తదితరులు మాట్లాడుతూ జ్యోతిరావు గొప్పదనాన్ని కొనియాడారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ ఎస్‌.శ్రీనివాసమూర్తి, జిల్లా బిసి సంక్షేమాధికారిణి జ్యోతిశ్రీ, బిసి కార్పొరేషన్‌ ఇడి పెంటోజీరావు, ఎబిసిడబ్ల్యూఒలు, సంక్షేమాధికారులు, జిల్లా అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.జిల్లా పోలీసు కార్యాలయంలో పూలే చిత్రపటానికి ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ నివాళులర్పించారు. పూలే సేవలను కొనియాడారు.

ఆధునిక వైతాళికుడు జ్యోతిరావ్‌ పూలే

దేశ ఆధునిక వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం పునరంకితమవుదామని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్‌ పల్లి నల్లనయ్య పిలుపునిచ్చారు.శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ సిటీ ప్లానర్లు హరిబాబు, రమణమూర్తి, టిపిఆర్‌ఒ సింహాచలం, ఉద్యోగ సంఘం అధ్యక్షులు నర్సింగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️