ప్రజాశక్తి – చిత్తూరు : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుక్రవారం చిత్తూరు జిల్లా కేంద్రంలో పూలే విగ్రహానికి సిపిఎం ఆధ్వర్యంలో పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ దేశంలో సామాజిక విప్లవం తీసుకొచ్చిన గొప్ప సామాజిక వేత్త అని కొనియాడారు. తన భార్యకు చదువు చెప్పి దేశంలో ఉండే మహిళలు చదువుకున్నప్పుడే దేశం అభివృద్ధి జరుగుతుందని దేశంలోనే మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలుగా తయారు చేసిన గొప్ప నాయకుడు అన్నారు. అలాంటి గొప్ప నాయకుని ఆశయాలను ముందుకు తీసుకెళ్లినప్పుడే ఆయనకు నిజమైన నివాళులర్పించినట్లు అవుతుందని తెలిపారు. దేశం లో ఉన్న శక్తులు కులాల వారీగా మతాలవారీగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని యువతకు పిలుపునిచ్చారు. సామాజిక ఉద్యమాలు బలపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలసుబ్రమణ్యం, రాజేష్ దాము తదితరులు పాల్గొన్నారు
