పోర్టు హాస్పిటల్‌ ప్రయివేటీకరణ టెండర్‌ రద్దుచేయాలి

Mar 13,2025 00:28 #Port hospital deekshalu
port hospital deekshalu

ప్రజాశక్తి-సీతమ్మధార : పోర్టు హాస్పిటల్‌ ప్రయివేటీకరణ టెండర్‌ రద్దు చేయాలని యునైటెడ్‌ డాక్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) అధ్యక్షులు జె.సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. పోర్టు హాస్పిటల్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఆసుపత్రి వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారం నాటికి 163వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలనుద్దేశించి సత్యనారాయణ మాట్లాడుతూ, ఏటా రూ.వందల కోట్లు లాభాలను సంపాదిస్తున్న పోర్టు ఉద్యోగుల ఆరోగ్యాన్ని వ్యాపారం చేయడం సమంజసం కాదన్నారు. ఈ సంవత్సరం సుమారు రూ.800 కోట్లు లాభాలు వచ్చాయన్నారు. దాంట్లో నాలుగో వాటా ఖర్చుపెట్టినా హాస్పిటల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, సిబ్బందిని నియమించవచ్చని తెలిపారు. ఇలా ఆలోచించకుండా ప్రయివేటు వారికి అప్పగించాలని ఆలోచించడం దుర్మార్గమన్నారు. పోర్టు యాజమాన్యం వద్ద రిజర్వ్‌ ఫండ్లు, వేల ఎకరాల భూమి ఉన్నప్పటికీ, ప్రయివేటీకరణపై తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రయివేటీకరణ కొనసాగితే, కార్మికులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు సిహెచ్‌.త్రినాధరావు, నాయుడు, రామారావు, బి.జగన్‌, నర్సింగరావు, లక్ష్మణ్‌, రాఘవులు, పాల్గొన్నారు.

➡️