పోర్టు హాస్పిటల్‌ ప్రయివేటీకరణ ఆపాలి

Feb 6,2025 00:09 #Port hospital deekshalu
port Hospital deekshalu

 ప్రజాశక్తి-సీతమ్మధార : పోర్టు హాస్పిటల్‌ ప్రైవేటీకరణ ఆపాలని, సొంత నిధులతో అభివృద్ధి చేయాలని విశాఖ పోర్టు అండ్‌ డాక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు విఎస్‌.పద్మనాభరాజు డిమాండ్‌చేశారు. పోర్టు హాస్పిటల్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఆసుపత్రి వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారం నాటికి 128వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పద్మనాభరాజు మాట్లాడుతూ, పోర్టు గోల్డెన్‌ జూబ్లీ హాస్పిటల్‌ 150 పడకల సామర్థ్యంతో నిర్మించి ప్రస్తుతం 80 పడకలతో సమర్థవంతంగా నడుస్తుందన్నారు. పోర్టు అండ్‌ డాక్‌ అధికారులకు, ఉద్యోగులకు, కార్మికులకు, రిటైర్‌ అయిన కార్మికులకు, ఫ్యామిలీ పెన్షనర్లకు, పూల్‌ కళాశీలకు, సిహెచ్‌డి క్యాజువల్‌ కార్మికులకు, సిఐఎస్‌ఎఫ్‌ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు 40 వేల కుటుంబాలకు దశాబ్దాల తరబడి సేవలందిస్తోందని తెలిపారు. అటువంటి పోర్టు హాస్పిటల్‌ను పిపిపి పద్ధతిలో ”మల్టీ డిసిప్లైనరీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌’గా 300 పడకలతో ప్రైవేటు వారికి ఇచ్చేయాలనే నిర్ణయం దుర్మార్గమన్నారు. ఈ నిర్ణయాన్ని సిఐటియు వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఇది అమలైతే సుమారు 40 వేల మంది కార్మిక కుటుంబాల ఆరోగ్య భద్రతను ప్రైవేటు వారి చేతుల్లో పెట్టడమే అవుతుందన్నారు. నిరంతరం లాభాలతో నడుస్తున్న విశాఖ పోర్టు సొంత నిధులతోనే పోర్టు ఆసుపత్రిని అత్యంత మల్టీ-సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని, స్పెషలిస్ట్‌ డాక్టర్లను, ల్యాబ్‌లను, స్పెషలైజ్డ్‌ స్టాఫ్‌ను, నాణ్యమైన మందులను పోర్టు సొంత నిధులతోనే అభివృద్ధి చేసే చర్యలను చేపట్టాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.సత్యనారాయణ, అధ్యక్షులు జె.సత్యనారాయణ, రామలింగేశ్వరరావుమూర్తి, సిహెచ్‌విఎస్‌.రెడ్డి, బి.జగన్‌, నరసింహ రాఘవులు, జె.రామారావు తదితరులు పాల్గొన్నారు.

➡️