కబ్జాదారుడి చెర నుంచి భూముల స్వాధీనం

ప్రజాశక్తి-కొండపి: మండలంలోని పెట్లూరు పంచాయతీలోని సర్వే నెంబరు 450లో ఉన్న ప్రభుత్వ భూమిని ఎస్సీలకు నివాస స్థలాల కోసం గత ప్రభుత్వంలో మంజూరు చేసి పట్టాలు ఇవ్వగా అదే గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు, రౌడీ షీటర్‌ కల్లూరి హరిబాబు వారిని బెదిరించి భూమి ఆక్రమించుకున్నాడు. అప్పటి నుంచి ఎస్సీ మహిళలు నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతూ పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం టిడిపి గెలుపొందడంతో ఎమ్మెల్యే స్వామి సహకారంతో తిరిగి తమ భూములను స్వాధీనపరుచుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి సమీపంలో ఎంపి స్కూల్‌ పక్కనే ప్రభుత్వ భూమిలో చింతతోపు ఉండేది. అది గ్రామానికి చెందిన కొంత మంది రైతుల ఆధీనంలో ఉండేదని తెలిపారు. ఎస్సీ కాలనీలో నివాస స్థలాలకై ఇబ్బందులు పడుతుండగా ఆనాటి టిడిపి ప్రభుత్వం హయాంలో ఎస్సీలకు సుమారు 50 మందికి పైగా నివాసస్థలాలు ఇచ్చారు. ఇందుకు ఆ భూమి ఆధీనంలో ఉన్న రైతులు కూడా ఎస్సీలకు నివాసస్థలాలు ఇవ్వడానికి కూడా అంగీకరించారు. తదనంతరం వైసిపి పాలన రావడంతో అదే గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు, రౌడీ షీటరు కల్లూరి హరిబాబు.. ఎస్సీలకు కేటాయించిన ఆ భూమిని వారిని బెదిరించి బలవంతంగా అక్రమించి వ్యవసాయ భూమిగా సాగు చేసుకుంటున్నాడు. బాధిత ఎస్సీ ప్రజలు తమ భూమి తమకు ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. కోర్డును ఆశ్రయించగా ఎస్సీలకు కేటాయించిన భూమిలోకి వెళ్లరాదని కోర్టు ఆదేశాలను జారీ చేసింది. అయినా కోర్టు ఆదేశాలను పక్కకు నెట్టి ఆ భూమిని కబ్జాదారుడు యథేచ్ఛగా సాగు చేస్తున్నాడు. అప్పటి తహశీల్దారుకు భారీగా ముడుపులు అప్పగించి ఆ భూమిని తన పేరు మీదకు మార్చుకున్నాడు. ప్రస్తుతం టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిడిపి నాయకులు మూలె కోటేశ్వరరావు, బొల్లినేని నరసింహం, గుజ్జుల శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు, మహిళలు దాదాపు 100 మందికి పైగా భూమిలోకి ప్రవేశించి వారికి కేటాయించిన నివాస స్థలాలలో పాకలు వేశారు. ఎస్సీ కాలనీవాసులు మాట్లాడుతూ ప్రస్తుతం తాము ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు వారు కాపురాలు ఉంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే స్వామి తమకు ఇళ్లు మంజూరు చేస్తే వెంటనే ఆ భూమిలో పక్కా రోడ్డు వేసుకొని నివాస గృహాలు నిర్మించుకుంటామని వారు తెలిపారు.

➡️