ప్రజాసేవ చేయడానికే పదవులు

Oct 1,2024 22:00
ఫొటో : పింఛన్‌ను అందజేస్తున్న వేమిరెడ్డి దంపతులు

ఫొటో : పింఛన్‌ను అందజేస్తున్న వేమిరెడ్డి దంపతులు

ప్రజాసేవ చేయడానికే పదవులు

– వేమిరెడ్డి దంపతులు

ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం : ప్రజలకు మరింత చేరువై వారికి సేవ చేసుకునేందుకే తాము రాజకీయ పదవుల్లోకి వచ్చామని నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కోవూరు ఎంఎల్‌ఎ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పష్టం చేశారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణ పరిధిలోని వవ్వేరులో మంగళవారం జరిగిన ఎన్‌టిఆర్‌ పెన్షన్‌ భరోసాలో వారిరువురు పాల్గొని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంఎల్‌ఎ మాట్లాడుతూ గత ఎంఎల్‌ఎ లాగా అడ్డగోలు సంపాదన తమకు అవసరం లేదని అందుకు రాజకీయాల్లోకి రాలేదన్నారు. అక్రమ ఇసుక, గ్రావెల్‌ దందాలు చేయిస్తూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను బెదిరించి భారీ మొత్తంలో అక్రమ సంపాదనకు అలవాటుపడ్డ మాజీ ఎంఎల్‌ఎ ప్రసన్నను నియోజకవర్గ ప్రజలు తిరస్కరిస్తున్నారని ఆమె వెల్లడించారు. పనులు చేయకముందే మళిదేవి డ్రెయిన్‌, మైపాడు నాలుగు వరుసల రహదారి కాంట్రాక్టర్ల వద్ద నుంచి వసూలు చేసిన మొత్తం ఎంతో వారితో చెప్పిస్తానన్నారు. తమ మంచితనాన్ని చేతగానితనంగా భావించవద్దని ఆమె సూచించారు. వైసిపి కరపత్రాన్ని అడ్డుపెట్టుకొని తమపై తప్పుడు వార్తలు రాయిస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. గత ఎంఎల్‌ఎ అవినీతి భరించలేక తమను 54వేలకు పైగా మెజారిటీ అందించారన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధికి ఆటంకం ఉండకూడదంటే వర్గ పోరును వీడి ఐకమత్యంతో అభివృద్ధికి నాయకులు పాటుపడాలని ఆయన తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంం అభివృద్ధికి నిధులు పుష్కలంగా మంజూరు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ మోర్ల సుప్రజామురళి, మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, ఎంపిడిఒ నరసింహారావు, తహశీల్దారు అంబటి వెంకటేశ్వర్లు, పట్టణ కన్వీనర్‌ ఎం వి శేషయ్య, మండల కన్వీనర్‌ బత్తల హరికృష్ణ, శివప్రసాద్‌, సురా శ్రీనివాసులు రెడ్డి, జొన్నవాడ మాజీ చైర్మన్‌ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, గ్రామ నాయకులు, పలువురు కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️