సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారులు

ప్రజాశక్తి-బేస్తవారిపేట: రాష్ట్రంలో సంక్రాంతి పండుగ నాటికి గుంతలు లేని రహదారుల నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి న్నారు. బుధవారం బేస్తవారిపేట మండలంలోని కోనపల్లి రోడ్‌లో చేపట్టిన మరమ్మతులను గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్‌రెడ్డితో కలిసి తనిఖీ నిర్వహించారు. మొదటిసారిగా గిద్దలూరు నియోజకవర్గంలోని బేస్తవారి పేట మండలానికి వచ్చిన మంత్రికి ఆ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కొత్తపల్లి గ్రామ సమీపంలో దెబ్బతిన్న రోడ్డుకు చేస్తున్న మరమ్మతులను పరిశీలించారు. ఆ గ్రామ మహిళలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్‌ సక్రమంగా పంపిణీ అవుతుందా లేదా అని ఓ మహిళను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడు తూ రాష్ట్రంలో రహదారులు, భవనాల శాఖ పరిధిలో రహ దారుల మరమ్మతులకు 861 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ప్రకాశం జిల్లాలో 1,313 కిలో మీటర్ల మేర రోడ్ల మరమ్మతులకు రూ.21.38 కోట్లు నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. జనవరి 15 నాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని నిర్ణయించిన ప్పటికీ వర్షాల కారణంగా కొంత జాప్యం జరిగిందన్నారు. ఏదేమైనా జనవరి నెలాఖరుకు రోడ్లు మరమ్మతులను పూర్తి చేయడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. రోడ్ల మరమ్మతులలో నాణ్యత పాటించేలా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క రోడ్డు నిర్మాణం కూడా చేపట్టలేదని, పైగా రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రోడ్ల నిర్మాణానికి చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ల సారథ్యంలో రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రోడ్లను నిర్లక్ష్యం చేయడం వలన మౌలిక సదుపాయాలు లేక పరిశ్రమలు, టూరిజం రంగాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని దీంతో ఉపాధి లేక యువత పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో టిసిఎస్‌, బిపిసీఎల్‌, గూగుల్‌ సంస్థలు వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారన్నారు. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడి వలస వెళ్లాల్సిన పరిస్థితి నుంచి బయటపడవచ్చని అన్నారు. గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 200 కిలోమీటర్లు పైగా రోడ్ల మరమ్మతులకు నాలుగు కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గంలో నెలకొన్న రహదారుల పరిస్థితిపై మంత్రికి అశోక్‌రెడ్డి వివరించారు. కోనపల్లె నుంచి సిఎస్‌పురం వెళ్లే రోడ్డుకు, రాజుపాలెం రోడ్డుకు, సింగరపల్లె నుంచి మైదుకూరు రోడ్డుకు నిధులు కేటాయించాలని మంత్రికి విన్నవించారు. వెనుకబడిన గిద్దలూరు నియోజకవర్గంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి రోడ్లకు నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట ఆర్‌అండ్‌బి అధికారులు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️