నెల్లూరులో సిపిఎం ఇంటింటి ప్రచారం

Apr 3,2024 12:50 #Nellore District

ప్రజాశక్తి-నెల్లూరు : నగర నియోజకవర్గం 54వ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరపురం ప్రాంతంలో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు పాలకుల నిర్లక్ష్యం వల్లే నగర నియోజకవర్గ పరిధిలోని 53, 54 డివిజన్లు వెనకబడ్డాయన్నారు. 50 వేల మందికి పైగా జనాభా కలిగిన ప్రాంతంలో ప్రభుత్వ బ్యాంకు లేకపోవడం విచారకరమన్నారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ బ్యాంకు ఏర్పాటు చేసేవరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానికుల సహకారంతో పోరాటం చేస్తామన్నారు.
అవకాశవాద రాజకీయాలు చేస్తూ బెలూన్ల మాదిరిగా అపోహలతో గాల్లో తేలుతున్న నాయకులకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టి తిరిగి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. అటువంటి పార్టీకి మద్దతు ఇస్తున్న టిడిపి, వైసిపి, జనసేన పార్టీలకు ప్రజలు ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే సిపిఎంను ప్రజలు ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, జి నాగేశ్వరరావు, ఐద్వా సంఘం నాయకురాలు కత్తి పద్మ, ఆ డివిజన్ శాఖ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, సిపిఎం సిఐటియు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️