విశాఖ ఉక్కు రక్షణకై నెల్లూరులో ర్యాలీ

 ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శ
ప్రజాశక్తి-నెల్లూరు : జాతీయ కార్మిక సంఘాల ఐక్యవేదిక నెల్లూరు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయరాదని, విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అని, విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలని సెయిల్ లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల బలవంతపు బదిలీలను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును ప్రయివేటీకరించబోమంటూనే వేలాది మంది కార్మికులను తొలగించాలని చూడడం దారుణమని, ఇంకా ప్రజలను మభ్య పెట్టాలని చూడటం అత్యంత దుర్మార్గమని తెలిపారు. ఆంధ్రుల ఆత్మబలిదానాలతో సాధించిన విశాఖ స్టీల్స్టాంట్ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టకుంటే ఐక్య ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజయ్ కుమార్,నగర అధ్యక్షులు జి.నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు ఆంజనేయులు, సాగర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు

➡️