అద్దంకి (బాపట్ల) : ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అభివృద్ది చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. శుక్రవారం అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. నేడు జ్యోతిభాపూలే జయంతి సందర్భంగా …. రెండు కస్తూర్భా గాంధీ విద్యాలయాలకు మంత్రి గొట్టిపాటి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి.రవి కుమార్ మాట్లాడుతూ … సుమారు రూ.3 కోట్ల వ్యయంతో బల్లికురువ, ఏల్చూరుల్లో విద్యాలయాల నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. సరైన సౌకర్యాలు లేక కస్తూర్భా గాంధీ విద్యాలయాల పిల్లలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా 12 వేల మంది విద్యార్థులు పాఠశాల విద్యకు దూరమయ్యారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అభివృద్ది చేస్తున్నామన్నారు. బాలికల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ విద్యాలయాల నిర్మాణానికి మంత్రి నారా లోకేశ్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని తెలిపారు. ఆరు నెలల్లోనే విద్యాలయాల నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దాతల సహకారంతో బాలికలకు నాణ్యమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బాలికలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రాథమిక హక్కు అయిన విద్యను అందరికి అందించడమే లక్ష్యంగా మంత్రి లోకేష్ ప్రణాళిక సిద్దం చేస్తున్నారని వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అభివృద్ది చేస్తున్నాం : విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
