వైద్య కళాశాలలకు పి.పి.పి మోడల్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి : సిఎంకి లేఖ

Mar 11,2025 17:24 #anatapuram

ప్రజాశక్తి – అనంతపురం కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్లో కొత్త వైద్య కళాశాలలకు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) నమూనాను అమలు చేయాలని ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం సరైనది కాదని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజారోగ్య వేదిక అనంతపురం కార్యదర్శి శ్రీనివాసులు డాక్టర్ ప్రసూన డిమాండ్ చేశారు. స్థానిక ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మానవ హక్కుల వేదిక కన్వీనర్ చంద్రశేఖర్, విద్వాన్ విశ్వం విజ్ఞాన కేంద్రం కన్వీనర్ రాజమోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యరంగం పట్ల ప్రజా ఆరోగ్య వేదికగా తీవ్ర ఆందోళన, వ్యతిరేకతను తెలియజేస్తున్నామన్నారు. ప్రజలకు వైద్యం అందించడం, ఆరోగ్యాన్ని సంరక్షించడం, ప్రభుత్వ అత్యున్నత బాధ్యత. అలాంటి బాధ్యతను ప్రైవేటు భాగస్వామ్యంతో నడపాలని ఆలోచన సరైనది కాదన్నారు. ఆరోగ్య సంరక్షణలో ముఖ్యమైన వైద్య విద్యను పి.పి.పి నమూనా ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వలన ఆంధ్రప్రదేశ్ పౌరులకు ఆరోగ్య లభ్యత, వైద్య ఖర్చులను భరించగలిగే సామర్థ్యం, ప్రాథమిక హక్కు గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతాయన్నారు. ఈ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరుతూ మేము గతంలోనే ఒక వినతిపత్రం సమర్పించామని, ప్రజల ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ సమానమైన వైద్యం అందించాలని, వైద్య సేవల వాణిజ్యీకరణను నిరోధించాలంటే ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలని చెప్పిన ప్రభుత్వ విధానాలు ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టే విధంగా ఉన్నాయన్నారు.
గతంలో ప్రభుత్వం ప్రారంభించిన 17 వైద్య కళాశాలల్లో 10 కళాశాలలను పిపిపి మోడల్లోకి మార్చడం, అలాగే ఈ చట్రం కింద కొత్త కళాశాలలను స్థాపించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయని, ఇది ప్రభుత్వ మునుపటి వైఖరిని గణనీయంగా తిప్పికొట్టడాన్ని సూచిస్తుందన్నారు. ముఖ్యంగా, మీ పార్టీ గతంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల ప్రవేశాన్ని వ్యతిరేకించిందని గమనించాలన్నారు. అంతేకాకుండా గత ఎన్నికల సమయంలో దీనికి సంబంధించిన అన్ని ప్రభుత్వ ఉత్తర్వులను (GOs) రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, ఈ హామీని ప్రజలు విస్తృతంగా ప్రశంసించారు. ఇప్పుడు ఆ వాగ్దానాలకు, ప్రజల ఆశలకు విరుద్ధంగా పిపిపి నమూనాతో ముందుకు పోవడం మా ఉద్దేశమని ప్రభుత్వం ప్రకటించిండం ప్రజల విశ్వాసాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు.
వైద్య విద్యను ప్రైవేటీకరించడం వల్ల వైద్య విద్య ఖర్చులు విపరీతంగా ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల నుండి వచ్చిన విద్యార్ధులకు వైద్యవిద్య అందుబాటులో ఉండదు. చివరికి నిపుణులయిన ఆరోగ్య సిబ్బంది కొరతపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. ప్రజా సంక్షేమం కంటే కార్పొరేట్ లాభాలకు ప్రాధాన్యత ఇస్తుంది. పి.పి.పి. మోడల్ ప్రజారోగ్యం కంటే కార్పొరేట్ లాభాలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రమాదం ఉందని, ఇది పేద ప్రజల ఆరోగ్య సేవల నాణ్యత, అందుబాటు క్షీణతకు దారితీస్తుందన్నారు. కొత్తగా మంజూరైన వైద్య కళాశాలల్లో పి.పి.పి నమూనాను అమలు చేయాలనే నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని, గత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వైద్య కళాశాలల్లో అమలు చేసిన సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల పద్ధతిని మా ప్రభుత్వం రాగానే రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశలో నిబద్ధతతో కొత్తగా ప్రవేశపెట్టబోయే అన్ని వైద్య కళాశాలలను ప్రైవేట్ వారికి అప్పజెప్పకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని, అధిక-నాణ్యత గల ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ వైద్య కళాశాలల స్థాపన, నిర్వహణకు తగినంత నిధులను కేటాయించాలని, పౌరులందరికీ ఆరోగ్య హక్కును కల్పించే దిశలో ప్రజా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్థిరమైన, సమానమైన ఆరోగ్య సంరక్షణ విధానాలను అభివృద్ధి చేయడానికి ప్రజారోగ్య నిపుణులు, పౌర సమాజ సంస్థలతో అర్ధవంతమైన సంప్రదింపులు చేయాలని , ఆంధ్రప్రదేశ్ ప్రజల వైద్య ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య వేదిక సభ్యులు డాక్టర్ వీరభద్రయ్య, పలు ప్రజా సంఘాల  నాయకులు పాల్గొన్నారు.

➡️