ప్రజాశక్తి – ఆళ్లగడ్డ : ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్రస్థాయి లీగల్ బోర్డు ప్రెసిడెంట్ గా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆళ్ళగడ్డ న్యాయవాది ప్రభాకర్ రెడ్డిని ఆ సంస్థ జాతీయ చైర్మన్ డాక్టర్ టి.ఎం. ఓంకార్ నియమించారు. మంగళవారం మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా సదరు నియామక పత్రాన్ని సౌత్ జోన్ చైర్మన్ రత్న రాజు మరియు ఏపీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ మేకల వెంకటన్న చేతుల మీదుగా ప్రభాకర్ రెడ్డి అందుకున్నారు. ఈ సందర్భగా స్టేట్ లీగల్ బోర్డు ప్రెసిడెంట్ ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులు, భాద్యతలు ఉంటాయన్నారు. కానీ అనేక సందర్భాల్లో ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదని, హక్కులు లేని మనిషి బానిసతో సమానమన్నారు. మనిషి స్వతంత్రంగా జీవించి, తన మనుగడ కాపాడుకోవడానికి హక్కులు సహకరిస్తాయన్నారు. ఇలాంటి వాటిని ఎవరైనా ఉల్లంఘించి కష్టనష్టాలకు గురి చేసినపుడు బాధితులు మానవ హక్కుల కౌన్సెల్ ను ఆశ్రయించవచ్చన్నారు. బాధితులకు న్యాయం చేకూర్చుటకు ఈ సంస్థ ద్వారా తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు.
