గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

ప్రజాశక్తి- మార్కాపురం రూరల్‌ : సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా పట్టించుకోకుండా అభివద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మార్కా పురం వైకాపా సమన్వయకర్త, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుపై శుక్రవారం రాత్రి మార్కాపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 18వ తేదీన మార్కాపురం పట్టణంలోని కంభం సెంటర్‌లోని ముస్లిం షాదీఖానాకు సంబందించిన స్లాబ్‌ నిర్మాణ పనుల్లో అన్నా రాంబాబుతో పాటు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎం. షంషీర్‌ అలీబేగ్‌, 20వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ సలీంలు పాల్గొన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రిటర్నింగ్‌ అధికారి, ఉప కలెక్టర్‌ రాహుల్‌ మీనా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏఆర్వో, మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌ ను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు కమిషనర్‌ పట్టణ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ముగ్గురిపై రెండో పట్టణ ఎస్సై యం.సువర్ణ శుక్రవారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️