దళిత వాడల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేని పాలకులు
ప్రజాశక్తి-పొదిలి: దళిత వాడల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేని పాలకుల నిర్లక్ష్యం వల్ల వారు మురుగునీటితో సహజనం చేయాల్సిన పరిస్థితి దాపురించిందని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు ఏం రమేష్ అన్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆదివారం ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో నేత పాలెంను సిపిఎం బృందం సందర్శించింది. ఈ సందర్భంగా నేతపాలెంలోని మహిళలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిరోజు మురుగు నీటితో సహజనం చేస్తూ దోమలతో అవస్థలు పడుతున్నామని వారు వివరించారు. తమ బజారులో మురుగునీరు ఎటు పోయెందుకు అవకాశం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టించుకునేవారు లేరన్నారు. సమీపంలో ఒక పెద్ద గుంత తీశారని అక్కడ చేరిన ఈ మురుగునీరు మరలా వెనక్కి వస్తూ ఇల్ల మధ్యలో చేరుతుందని వాపోయారు. మురుగు కాలువలు కూడా శుభ్రం చేయడం లేదని దీంతో దోమలు విపరీతతంగా పెరిగి టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా వంటి అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మురుగు కాలువ పరిష్కారం కోసం అధికారులు అంచనాలు వేసి నిధులు లేవనే పేరుతో ఈ సమస్యని గాలికి వదిలేసారని వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇళ్ళ మధ్యలో కరెంటు స్తంభం ఉందని దాని తొలగించాలని కోరారు. గత ఏడాది కాలంగా సాగర్ పైప్ లైన్ పగిలిపోయి మంచినీరు రాక ఇబ్బందులు పడుతున్నామని మరమ్మత్తులు కూడా చేయలేదని మహిళలు వాపోయారు. సమీపంలో సాగర్ నీటి కుళాయిలకు మూతలు లేక వృధాగా పోతున్న తమకు నీరు అందడం లేదన్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మంచినీటి సమస్యను తక్షణం పరిష్కరించాలని అధికారుల డిమాండ్ చేశారు. అదేవిధంగా మురికి నీరు పోయేందుకు డ్రైనేజీ కాల్వ నిర్మాణానికి నగర పంచాయతీ అధికారులు నిధులు కేటాయించాలన్నారు. డ్రైనేజీ నిర్మాణానికి, మంచినీటి పైప్ లైన్ కోసం గతంలో నగర పంచాయతీ అధికారులు 9 లక్షలతో అంచనాలు తయారు చేశారన్నారు. అందుకు నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని కోరారు. విద్యుత్ స్తంభాన్ని కూడా అధికారులు చొరవ తీసుకొని మార్చేందుకు కృషి చేయాలన్నారు. నేతపాలెం సమస్యలపై తక్షణం అధికారుల స్పందించుకుంటే ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రాంతీ కమిటీ కన్వీనర్ పి.బాల నరసయ్య, నాయకులు ఏ శ్రీనివాసులు, ఆర్ శ్రీనివాసులు, నర్రా వెంకటేశ్వర రెడ్డి, నేతపాలెం మహిళలు అనిత, ఎలిజిబెత్ రాణి, పెద్దమ్మాయి, కల్పన, దివ్య, వసుంధరతదితరులు పాల్గొన్నారు.