ఫీజు బకాయిలు విడుదల కోరుతూ ధర్నా

ప్రజాశక్తి-దర్శి: పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో దర్శి మండల కార్యదర్శి నాగేశ్వరరావు అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కె విజరు పాల్గొని మాట్లాడుతూ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఇతర కోర్సులు చదువుతున్న 47,423 మంది విద్యార్థులకు 2023-24 సంవత్సరానికి సంబంధించి ఒక క్వార్టర్‌ మాత్రమే విడుదల చేశారు. మిగతా 3 క్వార్టర్లు విడుదల కాలేదు. 2024-25 విద్యా సంవత్సరానికి 3వ క్వార్టర్‌ గడుస్తున్నా నేటికీ విడుదల కాలేదన్నారు. గత ఏడాది, ఈ ఏడాది కలిపి సుమారు రూ.218 కోట్లు పెండింగ్‌ ఉందన్నారు. త్వరలో డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఇతర సెమిస్టర్‌ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు ముందుగానే విద్యార్థులు ఫీజు బకాయిలు కాలేజీకి చెల్లించాలని ఒత్తిడి ఉందన్నారు. ఒకవైపు పరీక్షల ఒత్తిడి, మరోవైపు ఫీజుల ఒత్తిడితో విద్యార్థులు సతమతం అవుతున్నారు. జిఓ నంబర్‌ 77 రద్దు చేసి పీజీకి రీయంబర్స్‌మెంట్‌ కల్పించాలన్నారు. సంక్షేమ హాస్టళ్లకు మెస్‌ చార్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ కాస్మోటిక్‌ చార్జీలు పెంచాలన్నారు. ఫీజుల విషయంలో గందరగోళానికి తెరదించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు ముగిసిన సందర్భంగా విద్యార్థులకు ఇచ్చిన హామీని అమలు చేసి మంచి ప్రభుత్వం అనిపించుకోవాలని, రియింబర్స్‌మెంట్‌ విద్యార్థుల తల్లుల ఖాతాలో వేస్తారా? లేక కాలేజీ యాజమాన్యం ఖాతాలో వేస్తారా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన ఫీజులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేయాలన్నారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15,000 వెంటనే అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ దర్శి నాయకులు ధర్మ ప్రకాష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️