- ఒంగోలులో కోలాహలంగా వేడుకలు
ప్రజాశక్తి-ఒంగోలు సిటీ : బాలల భవితకు బాలోత్సవాలు బంగారు బాటవేస్తాయని పలువురు వక్తలు కొనియాడారు. పలు విజ్ఞానదాయకమైన కార్యక్రమాలు నిర్వహించడం అభిలషణీయమని పేర్కొన్నారు. ఒంగోలు పివిఆర్ గ్రౌండ్స్‌లో ‘ప్రకాశం బాలోత్సవం ద్వితీయ పిల్లల పండుగ’ ఆనందోత్సాహాల నడుమ ఆదివారం కోలాహలంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి జిల్లాల నలుమూలల నుంచి సుమారు ఐదు వేల మంది విద్యార్థులు తరలివచ్చారు. ఎనిమిది వేదికలపై లఘునాటికలు, జానపద నృత్యాలు, ఏకపాత్రలు, కోలాటం, సైన్స్ ఎగ్జిబిషన్, చిత్రాలేఖనం, మట్టితో బొమ్మలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తొలుత బాలోత్సవ కమిటీ అధ్యక్షులు బండారు లక్ష్మీనారాయణ బాలోత్సవ జెండాను ఆవిష్కరించి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధనరావు మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు విజ్ఞానం అవసరమని, ఆ విజ్ఞానాన్ని వెలికితీసేందుకు కృషి చేస్తున్న బాలోత్సవ కమిటీ నిర్వాహకులను అభినందించారు. తొలుత ఆయన సైన్స్ విజ్ఞాన ప్రదర్శనలు పరిశీలించి విద్యార్థులను ప్రశంసించారు. జిల్లా విద్యాధికారి అత్తోట కిరణ్‌కుమార్, నగర మేయర్ గంగాడ సుజాత హాజరయ్యారు. వేలాదిమంది బాలబాలికలను ఒకే వేదికపై చేర్చి వారిలో ప్రజ్ఞాపాటవాలను వెలికితీస్తున్న బృహత్తర కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిసిఇబి సెక్రటరీ ఎం. శ్రీనివాసరావు, బాలోత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు ఎ.వి. రమణారెడ్డి, అమరావతి బాలోత్సవం కార్యదర్శి యు.వి.రామరాజు, యుటిఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు, బాలోత్సవ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.