- ప్రమాదాల నివారణకు పోలీసుల చొరవ
ప్రజాశక్తి-మార్కాపురం (ప్రకాశం జిల్లా) : ప్రమాదాలన నివారణకు వ్యవసాయ కార్మికుల కోసం ఆర్‌టిసి బస్సులు ఏర్పాటుకు ప్రకాశం జిల్లా మర్కాపురం పోలీసులు చొరవ చూపారు. రైతులకు, వ్యవసాయ కార్మికులకు అనుకూలంగా మార్కాపురం డిఎస్‌పి యు నాగరాజు, సిఐ పి సుబ్బారావు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కె మాధవరావు, ఆర్‌టిసి డిపో మేనేజర్ ఎఎస్ నరసింహులుతో వారు సమావేశం నిర్వహించారు. కార్మికుల కోసం ప్రత్యేకంగా ఆర్‌టిసి బస్సులు నడపాలని తీర్మానించారు. మార్కాపురం ప్రాంతంలో ఆటోల్లో కార్మికులు ప్రయాణించవద్దని, ప్రయాణిస్తే పరిమితికి లోబడి మాత్రమే ఉండాలని నిబంధనలు విధించారు. సోమవారం నుండి ఎనిమిది బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కార్మికులు ఆటోల్లో ఎక్కే ప్రదేశంలో ఆయా బస్సులను సిద్ధంగా ఉంచారు. మార్కాపురం పట్టణం నుంచి మిరప కోతలకు వందల సంఖ్యలో నిత్యం వెళుతుంటారు. వారందరికీ ఆర్‌టిసి బస్సులు అందుబాటులో ఉంటాయని ముందస్తుగా చెప్పారు. రైతుల పొలాల వద్ద కార్మికులను దింపేలా చర్యలు తీసుకున్నారు. మిరప కోత ముగించిన తరువాత సాయంత్రం అదే బస్సుల్లో కార్మికులను గమ్యం చేర్చే విధంగా చర్యలు చేపట్టారు.