- వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్
ప్రజాశక్తి-మార్కాపురం (ప్రకాశం జిల్లా) : ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు’ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ వ్యకాస ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టు సెంటర్‌లో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… వెలిగొండ ప్రాజెక్టును అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల వాగ్దానాలుగా వాడుకున్నాయని విమర్శించారు. టిడిపి కూటమి కూడా వాగ్దానం ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ ప్రకటించాలని, ప్రభుత్వ పరంగా సమస్యలన్నింటినీ గుర్తించాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గుమ్మా బాలనాగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు నెరుసుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.