అకాల వర్షం – రైతుల దైన్యం

ప్రజాశక్తి – చాపాడు (కడప) : మండల పరిధిలో గురువారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి రబీలో సాగు చేసిన వరి పంట దెబ్బతింది. ఒక్కసారిగా గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. రబీ సీజన్‌ లో రైతులు 1600 ఎకరాలలో వరి పంటను సాగు చేశారు. ప్రస్తుతం పంట చివరి దశలో ఉంది. 15 నుంచి 20 రోజులలో నూర్పిడి చేసే అవకాశం ఉంది. గాలులతో కూడిన వర్షం రావడంతో పంట నేలకొరిగింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చెంచుపల్లె, మడూరు, అన్నవరం, గుంత చియ్యపాడు తదితర గ్రామాల పరిధిలో వరి పంట నేలకొరిగింది. చేతికందివచ్చిన పంట నేలకొరగడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న పంటలను గుర్తించి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. సాగులో ఉన్న దోసపంటను కూడా ప్రస్తుత అకాల వర్షంతో నష్టపోయామని రైతులు వాపోయారు. మినుము, కొర్ర, నూగు దోస వంటి పంటలు కూడా దెబ్బతిన్నాయని కన్నీటిపర్యంతమయ్యారు.

➡️