ఏర్పాట్ల పరిశీలనలో మంత్రులు
ప్రజాశక్తి – తుళ్లూరు : మండలంలోని వెంకటపాలెం వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళ్యాణంలో సిఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, రాజధాని రైతులు, వివిధ గ్రామాలు, ప్రాంతాల నుండి ప్రజలు పాల్గొంటారని తెలిపారు. టిటిడి ఈవో జె.శ్యామలరావు మాట్లాడుతూ కళ్యాణాన్ని 27 వేల మంది తిలకించేందుకు వీలుగా సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. టిటిడి నిఘా,భద్రతా విభాగం నుండి 160 మంది, గుంటూరు జిల్లా పోలీస్ యంత్రాంగం నుండి 600 మందితో పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేస్తున్నట్లు చెప్పారు. ఐదు డ్రోన్లు, 70 సీసీ కెమెరాలను భద్రత, పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేశామన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వివిఐపిల కోసం 400 వాహనాలకు, ఆలయం కాంపౌండ్ వాల్ వెనుక వెయ్యి వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించామని, సీడ్ యాక్సిస్ రోడ్డు దక్షిణం వైపు 1500 వాహనాలకు పార్కింగ్ స్థలం కేటాయించామని వివరించారు. వచ్చేవారికి తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయంతో పాటు కళ్యాణ వేదిక,పరిసరాలు, పార్కింగ్ స్థలాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచడానికి వందమంది పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేశామని, కళ్యాణ వేదిక పరిసరాల్లో దాదాపు వంద మొబైల్ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆలయ పరిసరాలలో ప్రత్యేకంగా రెండు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, రెండు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయని అన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారికి ఆర్టీసీ సహకారంతో 310 బస్సులతో రవాణా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మీ,ఎం శాంతా రామ్, ఎం ఎస్ రాజు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవో వీరబ్రహ్మం పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కళ్యాణం ఏర్పాట్లను మంత్రుల బృందం పరిశీలించింది. వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, నారాయణ, సవిత, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పి సతీష్ కుమార్ తదితరులు పరిశీలించిన వారిలో ఉన్నారు.కళ్యాణం వేడుకలకు వ్యవధి తక్కువగా ఉండడంతో రాత్రివేళల్లోనూ కార్మికులు పనులు శరవేగంగా చేస్తున్నారు. సభా ప్రాంగణం వద్ద భూమిని చదును చేయడం, విద్యుత్ సరఫరాకు అవాంతరాలు ఏర్పడకుండా ట్రాన్సఫర్మ్‌లు ఏర్పాటు లాంటి పనులు వేగం పుంజుకున్నాయి. 25 ఎకరాల్లో ఆలయం చుట్టూ రెండు వరుసలుగా మొక్కలు నాటుతున్నారు.12,13 అడుగుల ఎత్తు ఉండే 3,600 మొక్కలను నాటే పనిలో కార్మికులు నిమగమయ్యారు. వేడుకలు ముగిశాక మొక్కల సంరక్షణ టిటిడి చేపట్టనుంది.
