టెన్త్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

Mar 9,2025 20:49

  119 కేంద్రాల్లో పరీక్షలు

మార్చి 17 నుంచి 31 వరకు నిర్వహణ

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు

‘ప్రజాశక్తి’తో జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు ముఖాముఖి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   మార్చి 17 తేదీ నుంచి 31 వరకు జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యం నాయుడు తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నేపధ్యంలో పరీక్షలకు చేస్తున్న ఏర్పాట్లు, విద్యార్థుల సన్నద్దం, పరీక్షలకు ఎలా సిద్ధం చేశారు అనే విషయాలపై ప్రజాశక్తికి ఆయన ముఖాముఖి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఏడాది ఎన్ని పాఠశాలల నుంచి ఎంతమంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు?

జిల్లాలో వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్న 450 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 23,765 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు బాలురు 11501మంది, బాలికలు 11,429 మంది, ప్రైవేటు విద్యార్థులు బాలురు 553మంది, బాలికలు 282 మంది పరీక్షకు హాజరు కానున్నారనీ తెలిపారు.పరీక్షలు ఎప్పటి నుంచి.

ఎన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు? సౌకర్యాలు ఎలా ఉంది?

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 17 తేదీ నుంచి 31 వరకు జరుగుతాయి. జిల్లాలో 119 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటలు వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. కేంద్రాల్లో వెలుతురు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్‌ వంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం.

పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు హాల్‌ టిక్కెట్ల పంపిణీ జరిగిందా?

పాఠశాలల్లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా ప్రభుత్వం వాట్సప్‌ ద్వారా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. పాఠశాలల్లో కూడా హాల్‌ టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

మెరుగైన ఫలితాలు కోసం తీసుకున్న చర్యలు ఏమిటి?

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది కంటే ఉత్తీర్ణతశాతం పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. ఇప్పటికే అన్ని విద్యా సంస్థల్లో సిలబస్‌ పూర్తి చేయడంతో పాటు ఫ్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించాం. మెరుగైన ఫలితాలు కోసం ఉదయం, సాయంత్రం గంట అదనంగా తరగతులు నిర్వహించి, చదివిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన స్టడీ మెటీరియల్‌ అందించింది. ఫ్రీ ఫైనల్‌ పరీక్షలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాం.

పరీక్షల నిర్వహణకు ఎంత మంది సిబ్బందిని నియమించారు?

119 కేంద్రాల్లో జరగనున్న టెన్త్‌ పరీక్షల కోసం మొత్తం 1300 మంది సిబ్బందిని నియమించాం. వీరితో పాటు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ లు, సిటింగ్‌ స్క్వాడ్లు, ఒక హైపవర్‌ కమిటీ నియమించాం. పరీక్షల విధులు నిర్వహించే ఉద్యోగులెవరూ సెల్‌ ఫోన్‌, ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరా లు ఉపయోగించడానికి అనుమతి లేదు.

పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి?

పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు పలు శాఖల సహకారం తీసుకుంటున్నాం. ఆర్టీసి, విద్యుత్‌, పోలీస్‌, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ సహకారం తీసుకుంటున్నాం. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. విద్యార్దులు సైతం ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సెల్‌ ఫోన్లు తీసుకొని వస్తే పరీక్షకు అనుమతించేది లేదు. కేవలం పెన్‌, అట్ట, హాల్‌ టికెట్‌ మాత్రమే విద్యార్థులు తెచ్చుకోవాలి.

విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేందుకు రవాణా సదుపాయం కల్పించారా?

పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశాం. ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం విద్యార్థులు వారి గ్రామాల నుంచి సకాలంలో వచ్చే విధంగా బస్సులు తిరుగుతాయి. ఆర్‌టిసి అధికారులు ఆ విధంగా ఏర్పాటు చేశారు. బస్సులు తిరిగే ప్రాంతంలో బస్సులో హాల్‌ టికెట్స్‌ చూపించి ఉచితంగా పరీక్షలకు హాజరు కావచ్చు.

➡️