టెన్త్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

Mar 16,2025 20:31

 నేటి నుంచి పరీక్షలు

119 కేంద్రాలు.. 23,765 మంది విద్యార్థులు

విద్యార్ధులకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం

ప్రశాంత వాతావరణంలో నిర్వహణకు చర్యలు

గంట ముందుగా విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలి

ఉమ్మడి జిల్లా పరిశీలకులు తెహరా సుల్తానా, డిఇఒ మాణిక్యంనాయుడు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :   ఈనెల 17 (సోమవారం) నుంచి పదోతరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఉమ్మడి జిల్లా పరీక్షల పరిశీలకులు తెహరా సుల్తానా, డిఇఒ యు.మాణిక్యం నాయుడు తెలిపారు. ఆదివారం డిఇఒ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరీక్షలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జిల్లాలో 119 కేంద్రాల్లో 23,765 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 22,930 మంది రెగ్యులర్‌ విద్యార్థులు, 835 మంది ప్రయివేటు విద్యార్థులు ఉన్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యారులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసి బస్సు ప్రయాణం ఉచితం. పరీక్షల నిర్వహణకు 1124 మంది చొప్పున రెండు విడతలకు 2248 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పర్యవేక్షణకు 9ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, ప్రతీ సెంటర్‌కు ఒక ఛీప్‌ సూపరింటెండెంట్‌, ఒక డిపార్ట్మెంట్‌ అధికారిని నియమించారు. పరీక్షా కేంద్రాలవద్ద 144 సెక్షన్‌ అమలుకానుంది. వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సరిపడా లైటింగ్‌, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలను ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి లేదు. ఇన్విజిలేటర్లు సైతం సెల్‌ఫోన్లు తీసుకురాకూడదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులంతా ఉపయోగించుకోవాలని కోరారు. గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. పరీక్ష జరిగే కేంద్రాల్లో మధ్యహ్నం 1 గంట నుంచి 5 వరకు స్కూళ్లు నిర్వహించాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు సమావేశంలో మన్యం జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్‌.తిరుపతి నాయుడు, పరీక్ష బోర్డు కన్వీనర్‌ సన్యాసి రాజు పాల్గొన్నారు.

గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలి

విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసుకునేందుకూ అనుకూలంగా ఏర్పాట్లు చేశాం. విద్యార్దులు ఉదయం 8.30 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. పెన్ను, అట్ట, హాల్‌ టిక్కెట్‌ తప్పకుండా పట్టుకొని రావాలి. ఎటువంటి ఎలాక్ట్రానిక్‌ పరికరాలు తీసుకొని రావొదు. సమయానికి వచ్చి ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా పరీక్షలు రాయాలి

యు.మాణిక్యం నాయుడు జిల్లా విద్యా శాఖ అధికారి.

సమయ పాలన, ప్రణాళిక విజయానికి పునాది

పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితంలో ఒక ముఖ్యమైన దశ. పరీక్షల సమయం విద్యార్థులకు అత్యంత కీలకమైనది. సరైన ప్రణాళిక, మానసిక స్థైర్యం, శారీరక ఆరోగ్యం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వంటివి విజయానికి పునాది వేస్తాయి. పరీక్షల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షలకు కొద్ది సమయం ముందు కొత్త విషయాలను చదవడం కాకుండా ఇప్పటివరకు చదివిన అంశాలను పునరావృతం చేసుకోవడం, ముఖ్యమైన పాయింట్లను నోట్స్‌ రూపంలో రాసుకోవడం, ప్రాముఖ్యత కలిగిన ప్రశ్నలను గుర్తుంచుకోవడం మంచిది. రాత్రివేళల్లో ఎక్కువ సమయం చదవడం కన్నా, ఉదయం తెల్లవారుజామున చదవడం మంచిది. రోజుకు కనీసం 6-8 గంటలు నిద్రపోవాలి. పరీక్షల ముందు పిల్లలతో తల్లిదండ్రులు సానుకూలంగా మాట్లాడాలి.

డాక్టర్‌ ఎన్‌ వి ఎస్‌ సూర్యనారాయణ

మానసిక శాస్త్రవేత్త,విజయనగరం

➡️