మున్సిపల్‌ చైర్మన్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం

Mar 11,2025 21:44

సంతకాలు పెట్టిన 9మంది వైసిపి కౌన్సిలర్లు?

టిడిపి అధిష్టానం గ్రీన్‌ సిగల్‌ కోసం ఎదురుచూపు

తూర్పుకాపు సామాజిక వర్గానికి చైర్మన్‌ పదవి ఇవ్వాలని వైసిపి కౌన్సిలర్ల షరతు

ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి మున్సిపల్‌ చైర్మన్‌ న సావు వెంకట మురళీకృష్ణపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టిడిపి, వైసిపి కౌన్సిలర్లు కలసి సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత స్థానిక సంస్థల పదవులను కైవసం చేసుకునేందుకు శరవేగంగా పావులు కదుపుతున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో బేబినాయన ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో మున్సిపల్‌ పీఠాన్ని టిడిపి కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరి ప్రయత్నాలకు వైసిపిలోని అసమ్మతి కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడంతో మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సులభతరమైందని చర్చ జరుగుతోంది. ఇప్పటికే అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్‌ కు ఇచ్చేందుకు తొమ్మిది మంది వైసిపి కౌన్సిలర్లు సంతకాలు పెట్టినట్లు తెలిసింది. ఈ విషయం వైసిపి జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుకు తెలియడంతో మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు, వైసిపి ముఖ్య నాయకులు కలసి వైసిపి కౌన్సిలర్లతో మూడు రోజుల క్రితం సమావేశం నిర్వహించి అవిశ్వాస తీర్మానంపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోవద్దని సూచించారు. అయినా కొంతమంది కౌన్సిలర్లు అంగీకరించలేదని తెలిసింది. సంతకాలు పెట్టిన 9మంది వైసిపి కౌన్సిలర్లుమున్సిపాలిటీలో 31 వార్డులు ఉండగా 20 మంది వైసిపి కౌన్సిలర్లు, 10మంది టిడిపి కౌన్సిలర్లు, ఒక ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌ ఉన్నారు. ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌ వాడపల్లి వనజకుమారి వైసిపిలో చేరడంతో వైసిపి కౌన్సిలర్ల సంఖ్య 21కు చేరింది. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 20మంది కౌన్సిలర్లు సంతకాలు అవసరం. 10మంది టిడిపి కౌన్సిలర్లు ఉండగా 9మంది వైసిపి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడంతో 19మంది అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉన్నారు. మరొకరు అవసరం కాగా ఎమ్మెల్యే బేబినాయనకు ఉన్న ఎక్స్‌ అఫిషియో ఓటుతో అవిశ్వాస తీర్మానం జిల్లా కలెక్టర్‌ కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు టిడిపి అధిష్టానం, ఎమ్మెల్యే బేబినాయన నుంచి గ్రీన్‌ సిగల్‌ రాకపోవడంతో వైసిపి, టిడిపి కౌన్సిలర్లు ఎదరు చూస్తున్నారు. తూర్పుకాపు సామాజిక వర్గానికి చైర్మన్‌ పదవి ఇవ్వాలని వైసిపి కౌన్సిలర్ల షరతు బొబ్బిలి మున్సిపల్‌ కౌన్సిలర్‌ గా తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన సావు వెంకట మురళీకృష్ణ ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టి మురళీకృష్ణను దించేసి అదే సామాజిక వర్గానికి చెందిన టిడిపి పట్టణ అధ్యక్షులు, ఎనిమిదో వార్డు కౌన్సిలర్‌ రాంబార్కి శరత్‌ కు ఇవ్వాలని వైసిపి కౌన్సిలర్లు షరతు పెట్టినట్లు తెలుస్తోంది. విజయనగరంలో వైసిపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన సమావేశంలో ఇదే విషయాన్ని ఒక కౌన్సిలర్‌ భర్త ప్రస్తావించినట్లు తెలిసింది. వైసిపి కౌన్సిలర్ల షరతుతో టిడిపికి తలనొప్పితూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన రాంబార్కి శరత్‌ కు చైర్మన్‌ పదవి ఇవ్వాలని వైసిపి కౌన్సిలర్లు షరతు పెట్టడంతో టిడిపికి తలనొప్పిగా మారినట్లు తెలిసింది. మున్సిపల్‌ ఎన్నికల్లో టిడిపి చైర్మన్‌ అభ్యర్థిగా ఆరో వార్డు కౌన్సిలర్‌ గెంబలి శ్రీనివాసరావును ప్రకటించడంతో మున్సిపల్‌ ఎన్నికల ఖర్చంతా ఆయనే భరించారు. ఎన్నికల్లో టిడిపి నుంచి పది మంది మాత్రమే గెలవడంతో ఆయన ప్రస్తుతం ఫ్లోర్‌ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే మున్సిపల్‌ ఎన్నికల్లో ఛైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించిన గెంబలి శ్రీనివాసరావుకు చైర్మన్‌ పదవి ఇవ్వాలని టిడిపిలో ఒక గ్రూపు కోరుతున్నట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల నుంచి ఎమ్మెల్యే బేబినాయన బొబ్బిలి వచ్చాక చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటారని చర్చ జరుగుతోంది. అవిశ్వాస తీర్మానం తెరపైకి రావడంతో టిడిపి,వైసిపి పోటాపోటీగా సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. బుధవారం టిడిపి కౌన్సిలర, గురువారం వైసిపి కౌన్సిలర్లు సమావేశం కానున్నట్లు తెలిసింది.

➡️