ప్రజాశక్తి -గాజువాక : విశాఖ డెయిరీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తామని యాజమాన్యాన్ని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలని విశాఖ కో-ఆపరేటివ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన విశాఖ డెయిరీ కార్మికులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలనుద్దేశించి జగ్గునాయుడు మాట్లాడుతూ, కార్మికుల విజయాన్ని ఏ శక్తీ ఆపలేదన్నారు. కార్మికులది న్యాయమైన పోరాటం అని, విజయం సాధిస్తామని తెలిపారు. విశాఖ డెయిరీ యాజమాన్యం రైతులకు ఇస్తున్న డబ్బులు తగ్గించి, వినియోగదారులకు మాత్రం పాలు రేట్లను పెంచిందని చెప్పారు. కావాలనే రూ.9 కోట్ల నష్టం చూపించి, రైతులను, కార్మికులను మోసం చేస్తుందన్నారు. కార్మికులను నిలువు దోపిడీ చేసి, వెట్టిచాకిరి చేయిస్తోందన్నారు. కార్మికుల మధ్య చీలిక తెచ్చి యాజమాన్యానికి అనుకూలంగా ఉన్న సంఘాన్ని తయారుచేస్తుందని తెలిపారు. బ్రిటిష్ రూల్‌ను విశాఖ డెయిరీ యాజమాన్యం అమలు చేయడానికి చూస్తుందని పేర్కొన్నారు. బ్రిటీష్ వారిని ఇండియా నుంచి తరిమికొట్టిన మాదిరిగానే విశాఖ డెయిరీలో జరుగు తుందని హెచ్చరించారు. కార్మికులకు డిఎ, హెచ్‌ఆర్‌ఎ ఇవ్వడం లేదన్నారు. విశాఖ డెయిరీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు కూడా అమలు చేయడం లేదన్నారు. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య సర్వీసు ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. కార్మికులందరూ ఐక్యంగా ఉంటే యాజమాన్యం మెడలు వంచడానికి అవకాశం ఉంటుందన్నారు. యాజమాన్యం తక్షణమే యూనియన్‌తో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.రాజేంద్రప్రసాద్, కార్మికులు పాల్గొన్నారు.