కోడి పందేలకు బరులు సిద్ధం

ప్రజాశక్తి-భట్టిప్రోలు: సంక్రాంతి సంబరాల పేరుతో పలుచోట్ల కోడిపందాల బరులను నిర్వాహకులు సిద్ధం చేశారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతున్న ఈ కోడిపందాల బరులు మూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా కొల్లూరు మండలం అడ్డరోడ్డు వద్ద, అనంతవరం గ్రామంలో, వేమూరు మండలంలోని జంపని చక్కెర కర్మాగారం సమీపంలో, చుండూరు మండలంలోని ఎడ్లపాడు వద్ద భారీ స్థాయిలో కోడిపందాల నిర్వహణకు సిద్ధం చేశారు. గతం వారం రోజుల నుంచి నిర్వాహకులు కోడిపందాల బరుల కోసం పంట భూములను అద్దెకి తీసుకొని చదును చేసి అవసరమైన భారీ టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 13, 14, 15 తేదీలలో కొనసాగే ఈ కోడిపందాల ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారే అవకాశం ఉంది. పందేలు తిలకించటానికి ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉన్న దష్ట్యా వారికి ప్రత్యేక ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా కోడిపందేల బరుల వద్ద పందేలతో పాటు వివిధ రకాల జూదాలు కూడా కొనసాగనున్నాయి. ఈ ప్రాంతాలలో మద్యం విక్రయాలు యథేచ్ఛగా కొనసాగటమే కాకుండా కారు రాజా కారు, లోన-బయట, మూడు ముక్కలాట వంటి పేకాటలు కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సోమవారం నుంచి బుధవారం వరకు కొనసాగే ఈ కోడిపందాల నిర్వహణ కొరకు ఆయా ప్రాంతాల అధికార పార్టీ నాయకులు దగ్గరుండి అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేయడం గమనార్హం. ఇలా ఉండగా అధికారికంగా కోడిపందాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ ఉన్నతస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో జరిగే ఆ ప్రాంతాల్లో ఈ మూడు రోజులపాటు పోలీసులు కూడా కనిపించే పరిస్థితి లేదు.

➡️