ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాలి

Jun 9,2024 00:07

మాట్లాడుతున్న సిహెచ్‌ బాబూరావు
ప్రజాశక్తి-గుంటూరు :
రాష్ట్రంలో ఎన్నికైన కొత్త ప్రభుత్వం ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌.బాబూరావు కోరారు. శుక్రవారం బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజి అధ్యక్షతన సమావేశం నిర్వహించగా బాబూరావు మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని, విభజన చట్టంలోని హామీల అమలుకు నిధులు కేటాయిస్తామని గత ప్రభుత్వాలు హామీఇచ్చినా ఆచరణలో అమలు జరగలేదన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి అమలు చేయాలని కోరారు. వెంటనే రాజధాని పనులను చేపట్టాలని, ఎన్నికల్లో టిడిపి, జనసేన ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు పూనుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు, నిర్వాశితులకు నష్టపరిహారానికి వెంటనే నిధులు కేటాయించాలని, మోగా డీఎస్సీ ప్రకటించాలని, సిపిఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సిపియం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ సీజన్‌ ప్రారంభమవుతోందని, ఖరీఫ్‌ సాగుకు సరిపడా విత్తనాలు, ఎరువులు, రైతుభరోసా కేంద్రాల ద్వారా అందుబాటులో వుంచాలని, కాల్వల్లో పూడిక, తూటుకాడ, గుర్రపుడెక్కను వెంటనే తొలిగించి, నీటి పారుదలకు అడ్డంకులు లేకుండా చేయాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ జిల్లాలో పెదవడ్లపూడి హైలెవల్‌ ఛానల్‌ను పూర్తిచేయాలని, నిధులు కేటాయించాలని, గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా నిధులు కేటాయించి, పనులు ప్రారంభించాలని కోరారు. జిల్లాలో ప్రభుత్వ భూముల్లో ఇళ్లేసుకుని నివాసముంటున్న పేదలకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని, మిచౌంగ్‌ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పా రావు, ఎం.రవి, ఎస్‌ఎస్‌.చెంగయ్య, కె.నళినీ కాంత్‌, నాయకులు డి.వెంకటరెడ్డి, బి.వెంకటే శ్వర్లు, ఎల్‌.అరుణ, బి.కోటేశ్వరి పాల్గొన్నారు.

➡️