ప్రొఫెసర్ కెఎస్.కృష్
ప్రజాశక్తి -మధురవాడ : ప్రఖ్యాత భూభౌతిక శాస్త్రవేత్తలకు ఇండియన్ జియోఫిజికల్ యూనియన్ (ఐజియు) ఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక ‘హరినారాయన్ లైఫ్ టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డు -2024’కు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ కె.ఎస్.కృష్ణ ఎంపికయ్యారు. మెరైన్ జియోఫిజిక్స్‌లో జరిపిన విశిష్ట పరిశోధనలను గుర్తిస్తూ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు జాతీయ స్థాయి సెలక్షన్ కమిటి ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జరగనున్న ఐజియు 61వ వార్షిక సమావేశాలలో ప్రొఫెసర్ కె.ఎస్.కృష్ణకు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేయనున్నారు. సముద్ర శాస్త్ర అధ్యయనాలలో 42ఏళ్ల సుధీర్ఘ బోధన, పరిశోధన అనుభవం గల ప్రొఫెసర్ కృష్ణ అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సహ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫి (గోవా)లలో పనిచేశారు. అలాగే ఒఎన్‌జిసి, గెయిల్, డిజిహెచ్ వంటి ప్రఖ్యాత సంస్థలకు హైడ్రోకార్బన్ నిల్వలను వెలికితీయడంలో శాస్త్రీయ సహకారం అందించారు. ప్రొఫెసర్ కృష్ణ చేసిన సేవలకు గుర్తిపుగా ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుతో పాటు జెసి బోస్ నేషనల్ ఫెలోషిప్‌లను అందుకున్నారు. ఐజియు అవార్డుకు ఎంపిక కావడం పట్ల ప్రొఫెసర్ కృష్ణ స్పందిస్తూ భవిష్యత్తులో శాస్త్ర విజ్ఞానాన్ని మరింతగా విస్తరించడానికి ప్రోత్సాహకరంగా ఈ అవార్డు ఉపయోగపడుతుందన్నారు. కాగా ప్రతిష్టాత్మక అవార్డుకు ప్రొఫెసర్ కృష్ణ ఎంపిక కావడం పట్ల ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వై.గౌతంరావు, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.వేదవతి హర్షం వెలిబుచ్చి, అభినందించారు.