వంటింట్లో ధరల మంట

ప్రజాశక్తి – కడప అర్బన్‌/ వేంపల్లె/ పులివెందుల టౌన్‌ పండగ వేళ నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. సామాన్యుడు ఏదీ కొనలేని పరిస్థితి. ఏ దుకాణానికి వెళ్లినా ధరల భారం తప్పడం లేదని మహిళలు వాపోతున్నారు. పండగ వేళ నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. సామాన్యుడు ఏదీ కొనలేని పరిస్థితి. ఏ దుకాణానికి వెళ్లినా ధరల భారం తప్పడం లేదని మహిళలు వాపోతున్నారు. దేవుడికి దీపం వెలిగించే నువ్వుల నూనె నుంచి వంట నూనెల ధరలు కంపెనీనిబట్టి కిలోకు రూ.20 నుంచి రూ . 40 వరకు పెరిగాయి. గత నెలలో కిలో తెల్లగడ్డలు రూ.300 ఉంటే ప్రస్తుతం రూ.360కి పెరిగాయి. చిల్లర దుకాణాల్లో కిలో రూ.400 వంతున అమ్ముతున్నారు. వివిధ రకాల పప్పుల మీద కిలోకి రూ.20 నుంచి రూ.40 వరకు ధరలు పెరిగిపోయాయి. బియ్యం కూడా భారీగా పెరిగాయి మేలు రకం బియ్యం 25 కిలోలు రు.1700 నుంచి రూ . 1850 పెరిగాయి. అలాగే టమోటా, ఉల్లి ధరలు కూడా పెరగడంతో సామాన్యునికి మరింత భారమవుతుంది. ప్రభుత్వం రాయితీలు ఇచ్చి నిత్యవసర సరుకులు, కూరగాయలు సరఫరా చేసి ఆదుకోవాలని మహిళలు కోరుతున్నారు. కూరగాయల విషయానికి వస్తే వారానికి సరపడ కూరగాయలు మార్కెట్‌లో కొనాలంటే కనీసం రూ.500 ఖర్చు చేయనిదే కూరగాయల బుట్టనిండడం లేదు. ఎర్రగడ్డలు, టమోట ధరలు ఆకాశానంటే పరిస్థితులు చూస్తున్నాం. నాణ్యతను కిలో బట్టి రూ.50 నుంచి రూ.80 వరకు ఎర్రగడ్డలు, టమోటాలు ధరలు పలుకుతున్నాయి. ధరలు నిలకడగా లేకపోవడానికి కారణం అతివృష్టి, అనావృష్టి అని వ్యవసాయశాఖ, మార్కెటింగ్‌ అధికారులు చెబుతున్నారు. విజయవాడ లాంటి ప్రాంతాలలో వరదలు వస్తే, రాయలసీమలో, అందులో కడప జిల్లాకు వస్తే అనావృష్టి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణశాఖ రాష్ట్రంలో వాయిగుండం కారణంగా భారీవర్షాలు పడుతాయని చెప్పినప్పుడు మాత్రమే కడపలో చిన్నపాటి వర్షం పడి మమా అనిపిస్తుంది. అంతకుమించి వర్షాలు పడిన దాఖలాలు లేవు. దీంతో కూరగాయల సాగు పూర్తిగా అటకెక్కింది. బోరుబావుల కింద అంతో..ఇంతో పండుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కూరగాయల ధరలు పరిశీలిస్తే కిలో.. ఎర్రగడ్డలు రూ.50, టమోట రూ. 50, బంగాళదుంపలు రూ.45, బీన్స్‌ రూ.80, క్యారెట్‌ రూ.45, చామగడ్డలు రూ. 80, మునగకాయలు రూ. 60, చిక్కుడు కాయలు రూ. 60, బీరకాయలు రూ. 40, అనపకాయలు రూ. 45, అలసందలు రూ. 50, కాకర కాయలు హైబ్రేడ్‌ రూ. 35, నాటువి రూ. 45, దొండకాయలు రూ.40, ముల్లంగి రూ. 40, కాప్సికం రూ. 55, బీట్రూట్‌ రూ. 30, కిరకాయ రూ. 50, అల్లం రూ.60, క్యాలీప్లవర్‌ రూ.45, క్యాబేజి రూ. 50, వంకాయలు రూ. 20, బెండకాయలు రూ. 20, మట్టికాయలు రూ. 20, సొరకాయ రూ. 30, బజ్జిమిరపకాయలు రూ. 50 ధరలు పలుకుతున్నాయి. కూరగాయల ధరలు అదుపు చేయాలని పేద, మధ్య తరగతి ప్రజలు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కూరగాయల ధరలు రోజురోజుకు పెరిగి పోతూ ఉండడంతో ఎక్కువ ధరలు పెట్టి కొన లేకున్నాం. బువ్వ తినలేకున్నాం. కూరలు చేసు కోవాలంటే కచ్చితంగా ఎర్రగడ్డలు, టమోటాలు ము ఖ్యం. వీటి ధరలు అమాంతం పెరిగిపోతూ ఉన్నాయి. పాలకులు ధరలను నియంత్రించి పేదలను ఆదుకోవాలి. -పావని, ఇందిరానగర్‌, కడప. కూరగాయల ధరలను రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించాలి. ఎర్రగడ్డలు, టమోటా రైతు బజార్‌లో సబ్సిడీకి అందజేయాలి. దళారీ వ్యవస్థను నిర్మూలించాలి. పేదల ఆదాయం పెరగడం లేదు. ధరలు మాత్రం ఆకాశాన్ని అందుతున్నాయి. ధరల నియంత్రణకు ప్రత్యేక నిధి కేటాయించాలి.-రాజామణి, బాలాజీ నగర్‌, కడప. నిత్యావసరాల ధరలు పెరిగిపోతుంటే పేదోళ్లు ఎలా బతకాలి. హోల్‌సేల్‌ మార్కెట్‌లోనూ ధరలు పెరిగాయి. ఇక వీధుల్లో ఉండే దుకాణ యజమానులు ధరలు భారీగా పెంచి అమ్ముతున్నారు. కూరగాయల ధరలు కూడా అమాంతంగా పెరిగాయి. ప్రభుత్వం పేదలను దృష్టిలో ఉంచుకుని ధరలు తగ్గించే మార్గాలు ఆలోచించాలి. – ఉమాదేవి, గహిణి, పులివెందులసబ్సిడీలు, ఇన్సూరెన్స్‌ కల్పించి ప్రోత్సహించాలి రైతులకు పండించే పంటలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు, ఇన్సూరెన్స్‌, కూరగాయలు పండించే రైతులకు కూడా కల్పించాలి. ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు లేవు. పంటలు బాగా పండిన సమయంలో వాటిని నిల్వ చేసుకునేందుకు సరైన శీతల గిడ్డంగులు అందుబాటులో లేవు. దీనివల్ల కూరగాయల ధరలు రోజురోజుకు అవకాశాన్ని అంటుతున్నాయి. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి పేద కుటుంబాలను ఆదుకోవాలి. – ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి

➡️