కొమరోలు (ప్రకాశం) : నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్యుడు భగ్గుమంటున్నాడు. కూరగాయల ధరలు పప్పులు, నూనెలు, బియ్యం ఇలా ఒక్కటేమిటీ దేనిని పట్టుకున్నా షాక్ కొట్టేలా పరిస్థితి ఉంది. పిల్లల చదువులు, ఇంట్లో నిత్యావసర సరుకులు, ఇంటి కిరాయిలు ఇతర ఖర్చులకు అరకొర సంపాదించే సామాన్యుడి జీతం నెల తిరిగేసరికి ఆవిరైపోతుంది. ఇక దినసరి కూలీ సంగతి సరేసరి. నిత్యావసర సరుకులు పెరుగుదల పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఇష్టారీతిగా సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా సామాన్యుడు పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. గత కొంతకాలంగా పెరిగిన ధరలు, ఇతర వ్యయాలతో కుటుంబ బడ్జెట్ తలకిందులవుతుంది. ఇంటి కిరాయిలు, పాలు, చక్కెర, పప్పులు, బియ్యం, కూరగాయలు, ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యుల నోట మాట రావడం లేదు. ప్రస్తుతం లీటరు నూనె ప్యాకెట్ పై ఏకంగా రూ.20 నుంచి రూ. 45కు పెరిగింది. బియ్యం ధరలు క్వింటాల్ కు రూ.300 నుంచి రూ.500 పెరిగాయి. ఇక పప్పుల ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. అందులో భాగంగా కందిపప్పు కేజీ రూ.150 నుంచి రూ.175, పెసరపప్పు కేజీ రూ.135 నుంచి రూ.150, మినపప్పు రూ.135 కి చేరింది. అల్లం కిలో రూ.100 నుంచి రూ.150 వరకు ఉంది. వెల్లుల్లి కిలో రూ.300 నుంచి రూ.360, ఎండు మిర్చి రూ.200గా ఉంది. ఇక ఉల్లి ధరలు అయితే రూ.60 నుంచి కిందకు దిగడం లేదు. అటూ కూరగాయల ధరలు కూడా అంతే ఉన్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలా ప్రభుత్వాలు మారిన పేదవారి దీనగాధ మారలేదు. ఈ ప్రభుత్వాల మధ్య పేదవాడి జీవితం నలిగిపోతూనే ఉంటుందని ప్రజలు వాపోతున్నారు.