ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలి

సబ్బవరంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

ప్రజాశక్తి-సబ్బవరం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేయడానికి కూటమి నాయకులు సమన్వయంతో పనిచేయాలని పెందుర్తి నియోజకవర్గం పరిశీలకులు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. మండలంలోని ఇరువాడ దరి ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గం నుండి సుమారు 35 వేల మందిని తరలిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి గండి బాబ్జి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కె.మనోరమ, తహశీల్దారు బి.చిన్నికృష్ణ, ఎంపీడీవో పి.పద్మజ, ఎమ్మెల్యే సోదరుడు పంచకర్ల వెంకటేశ్వరరావు టిడిపి కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేయాలని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కె.మనోరమ అధికారులను ఆదేశించారు. స్థానిక మండల పరిషత్తు సమావేశ మందిరంలో మంగళవారం అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. మండలానికి 150 బస్సులను కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.

చోడవరం : విశాఖలో జరుగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌.రాజు పిలుపునిచ్చారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆంజనేయులు పాల్గొన్నారు.

అనకాపల్లి : ప్రధాని మోడీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేపట్టాలని నియోజకవర్గం పరిశీలకులు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌.వర్మ పిలుపునిచ్చారు. స్థానిక టిడిపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ, రాష్ట్ర గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ మళ్ళ సురేంద్ర పార్టీ నాయకులు పాల్గొన్నారు. మోడీ బహిరంగ సభను విజయవంతం చేయవలసిన బాధ్యత కూటమి శ్రేణులపై ఉందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు అన్నారు. టిడిపి పార్లమెంట్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోడీ పర్యటన విజయవంతంపై జీవీఎంసీ అనకాపల్లి జోనల్‌ కార్యాలయంలో ఇన్‌ఛార్జి జోనల్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమం విజయవంతం చేసే దిశగా సచివాలయ సిబ్బంది కృషి చేయాలని కోరారు. సమావేశంలో మళ్ళ సురేంద్ర, సంతోష్‌ కుమార్‌, సీఈఓ కొండమ్మ, పాల్గొన్నారు.

నక్కపల్లి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనను, మండలంలోని రాజయ్యపేట ప్రాంతంలో జరగనున్న వర్చువల్‌ మీట్‌ ను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్‌ అన్నారు. మంగళవారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారి పి ప్రసాద్‌, తహసిల్దార్‌ నరసింహామూర్తి, ఎంపిడిఒ డి.సీతారామరాజు ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. మోడీ విశాఖ సభకు, వర్చువల్‌ మీట్‌కు జన సమీకరణ పై చర్చించారు.

మాడుగుల : ఈనెల 8న విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు మాడుగుల మండలం నుండి 25 బస్సులు బయలుదేరుతాయని ఎంపిడిఒో కొంకి అప్పారావు తెలిపారు. ఇప్పటికే జన సమీకరణపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రధాని సభకు వెళ్లిన వారిని తిరిగి వారి గమ్యస్థానం చేరేంతవరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు.

భీమునిపట్నం : విశాఖలో బుధవారం నిర్వహించే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన, రోడ్‌షోను విజయవంతం చేయాలని కూటమి శ్రేణులను కార్యక్రమ పరిశీలకులు జివి.ఆంజనేయులు కోరారు. ప్రధాన మంత్రి సభను విజయవంతం చేయాలని కోరుతూ స్థానిక టిడిపి కార్యాలయంలో మంగళవారం నియోజక వర్గ స్థాయి కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కోట్ని బాలాజీ, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు

సీతమ్మధార : ప్రధాని మోడీ విశాఖ పర్యటన విజయవంతం చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌ పిలుపునిచ్చారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఆధ్వర్యాన జనసేన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, ఉత్తరాంధ్ర జిల్లాల కో-అర్డినేటర్లు, జివిఎంసి మహిళా కార్పొరేటర్లు, మహిళలు పాల్గొన్నారు.

➡️